టీడీపీ ఓటింగ్ శాతం పెరిగింది - పార్టీ పుంజుకుంటున్నట్లేనా : తాజా ఫలితాల్లో తేలిందేంటి..!!
ఏపీలో టీడీపీ పుంజుకుంటుందా. తాజాగా జరిగిన ఎన్నికల్లో అదే తేలిందా. అధికార వైసీపీ మెజార్టీ సీట్లు గెలుచుకున్నా..ఓట్ల విషయంలో మాత్రం టీడీపీ గతం కంటే పుంజుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీలు.. 14 కార్పోరేషన్లలో వైసీపీ విజయం సాధించింది. అయితే, ఈ సారి జరిగిన ఎన్నికల్లో మాత్రం టీడీపీ కొంత మేర గతం కంటే మెరుగ్గా ఫైట్ ఇచ్చినట్లుగా ఓట్ల శాతం చెబుతోంది.

టీడీపీకి ఓట్ల శాతం పెరిగిందంటూ
పార్టీ నేతలు చేస్తున్న తాజా విశ్లేషణల ద్వారా గతం కంటే ఓట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం నెల్లూరు కార్పోరేషన్ తో సహా 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. అందులో మొత్తం వార్డుల సంఖ్య.. 353 . కాగా, అందులో వైసీపీ 261 స్థానాలు గెలవగా.. టీడీపీ 82 గెలిచింది .జనసేన 5 చోట్ల, స్వతంత్ర అభ్యర్ధులు మరో అయిదు చోట్ల గెలుపొందారు. ఆరు నెలల కింద మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీకి 30.13 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో 44.96 శాతం వచ్చాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోవడం టీడీపీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఆరు నెలల కాలంలోనే మార్పు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి పది వేల మెజారిటీ వచ్చింది. నెల్లూరు కార్పొరేషన్‌లో ఒక్క డివిజన్ కూడా రాకపోవడం మాత్రం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతన్నారు. నెల్లూరు తొలి నుంచి వైసీపీకి మద్దతుగా ఉందని టీడీపీ నేతలు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అక్కడ జిల్లాలోని టీడీపీ నేతల మధ్య అనైక్యత ఈ ఫలితాలకు కారణమని స్పష్టం అవుతోంది. నెల్లూరులో చివరి అంకంలో పార్టీ రాస్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మకాం వేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నెల్లూరు ఫలితాలు మాత్రం డామేజింగ్
చివరకు గెలుస్తామనుకున్న వార్డులు కూడా గెలవలేకపోయారు. అక్కడ కమ్యూనిస్టులతో పొత్తు...ఏ మాత్రం కలిసి రాలేదని విశ్లేషిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయితీని గెలుచుకోవడం, కృష్ణా జిల్లా కొండపల్లిని ఖాతాలో వేసుకోవడం, జగ్గయ్యపేట మున్సిపాలిటీలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఇవ్వడం టీడీపీ వర్గాలకు సంతృప్తినిచ్చింది. దర్శిలో టీడీపీకి అంత గొప్ప నాయకత్వం లేకపోయినా ఆ నగర పంచాయతీని గెలుచుకోగలిగింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గం డోన్‌లో చాలాకాలంగా టీడీపీని నడిపించే నాయకుడు లేడని పార్టీ నేతలు చెబుతున్నారు.

కుప్పంలో వైసీపీది గెలుపే కాదంటూ
రాజంపేట మున్సిపాలిటీ, కమలాపురం నగర పంచాయతీలను వైసీపీయే గెలుచుకున్నా.. తమ ఓట్ల శాతం పెంచుకున్నామని, కొన్ని స్థానాల్లో విజయం సాధించగలిగామని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. వీటిని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్న తరువాత వాస్తవ పరిస్థితి పైన అంచనా వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, మొత్తంగా మాత్రం గత ఎన్నికల కంటే పుంజుకున్నామని మాత్రం ధీమాగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications