జగన్‌కు తలనొప్పి: రాజధానిపై రెండుగా చీలిన నేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు వ్యవహారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై పార్టీలోని నేతలు ప్రాంతాలవారీగా రెండుగా చీలిపోయారు. కర్నూలును రాజధాని చేయాలని రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాల శాసనసభ్యులతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా శాసనసభ్యులు వాదిస్తున్నారు.
విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉంటేనే బాగుంటుందని మిగతా కోస్తా జిల్లాల శాసనసభ్యులు వాదిస్తున్నారు. విజయవాడను రాజధానిగా చేస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, ఇప్పటికే ఈ ప్రాంతం వెనకబడి ఉందని, కర్నూలు కాకపోయినా ప్రకాశం జిల్లాలో రాజధానిని పెడితే రాయలసీమ జిల్లాలకు సమీపంలో ఉంటుందని రాయలసీమ శాసనసభ్యులు అంటున్నారుట.

మంగళవారం శాసనసభ ఆవరణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల శాసనసభ్యులు నలుగురైదుగురు కూర్చుని ఇదే విషయం చర్చించుకున్నారు. విజయవాడ రాజధాని అయిన తర్వాత రాయలసీమపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని కోస్తాంధ్ర శాసనసభ్యులు అంటున్నారు.
ఇరు ప్రాంతాల శాసనసభ్యులు కూడా ఇటీవల ఈ వివాదాన్ని జగన్ ముందు పెట్టినట్లు సమాచారం. రాజధాని విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలు వద్దని, పార్టీపరంగా ఒకే విధానానికి శాసనసభ్యులు కట్టుబడి ఉండాలని జగన్ హితబోధ చేసినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండే విధంగా, కనీసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట రాజధానిని ఏర్పాటు చేయాలని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందని, ఈ వాదనతోనే ముందుకు వెళ్దామని జగన్ తన పార్టీ శాసనసభ్యులకు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications