అమరావతి:న్యాయశాఖను ఊహించని సమస్య సుదీర్ఘకాలంగా పట్టి పీడిస్తోంది. ఫలితంగా న్యాయశాఖతో పాటు కక్షిదారులు తమకు రావాల్సిన డబ్బులు సకాలంలో వెనక్కి రాక లబోదిబోమంటున్నారు. ఈ సమస్యకు ఎపి ఖజానా శాఖ వ్యవహారశైలే కారణమని తెలుస్తోంది.
ఈ శాఖ పనితీరు కారణంగా రాష్ట్రంలోని న్యాయశాఖ ఖాతాలన్నీ స్తంభించిపోయాయి. దీంతో కక్షిదారులకు న్యాయమూర్తులు చెక్కులు విడుదల చేయడం నిలిపి వేయటంతో వాళ్లు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. అసలే కోర్టు చుట్టూ తిరిగి కుదేలైన స్థితిలో న్యాయ శాఖ నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడం కక్షిదారులకు అతి పెద్ద సమస్యగా పరిణమించింది. వివరాల్లోకి వెళితే...

గతంలో...పద్దతి మారింది
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో వివిధ కేసులకు సంబంధించి ప్రతివాదుల సొమ్మును న్యాయమూర్తుల పేరు మీద చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం
ఆ చెక్కులను ఖజానా శాఖలో ఉన్న న్యాయమూర్తి ఖాతాలో జమ చేస్తారు. ఆయా కేసులు పరిష్కారమైన తర్వాత బాధితులైన క్లయింట్లకు సంబంధిత డబ్బును వారి పేరు మీద చెక్కుల రూపంలో న్యాయమూర్తి విడుదల చేస్తారు. సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న పద్ధతి ఇదైతే గత కొంత కాలం నుంచి న్యాయశాఖ ఆధీనంలోని క్లయింట్లకు చెందిన నగదును కూడా ఖజానా శాఖే తమ అధీనంలోకి తీసుకుంది.

మారిన పద్దతితో...ఇబ్బందులు
ఈ క్రమంలో ప్రతినెలా క్లయింట్లకు న్యాయమూర్తులు విడుదల చేసిన చెక్కులు అదే నెల ఆఖరులోగా మార్చుకోలేకపోతే ఆపై ఆ చెక్కులు చెల్లడం లేదు. దీనితో అప్పటి నుంచి న్యాయ శాఖలో ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇదే సమస్య గత ఏడాది అక్టోబరు నెలలో రాజమండ్రికి చెందిన ఓ న్యాయమూర్తి ఎదుర్కోవడంతో ఆయన హైకోర్టుకు ఈ విషయమై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తాను జారీ చేసిన చెక్కులను ఖజానా శాఖ ఆమోదించలేదని, ఖాతాలను నిలిపియేయడంతో క్లయింటుకు విడుదల చేసిన చెక్కుచెల్లకుండా పోయిందని ఆయన ఫిర్యాదులో పేర్కొనట్లు తెలిసింది.

ప్రభుత్వం...ఉత్తర్వులు...అయినా
న్యాయమూర్తి ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎపి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి న్యాయశాఖ ఖాతాలను స్తంభింప చేయవద్దని, న్యాయమూర్తులు జారీ చేస్తున్న చెక్కులను వెంటనే ఆమోదించాలని 2017 డిసెంబర్ నెలలో రాష్ట్రంలోని అన్ని ఖజానా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ఈ ఉత్తర్వులను ఖజానా శాఖ అమలు చేయడం లేదని తెలుస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో ఖజానా శాఖ స్తంభింపజేసిన న్యాయమూర్తుల ఖాతాలను ఖజానా శాఖ ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దీంతో బాధితులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. అంతేకాదు మరోవైపు న్యాయమూర్తులకు అవసరమైనన్ని చెక్కులను కూడా ఖజానా శాఖ సరఫరా చేయడం లేదని తెలిసింది.

పర్యవసానం...క్లయింట్లపై
అయితే అంతిమంగా ఈ ప్రభావం కక్షిదారులపైనే పడుతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము న్యాయస్థానాల్లో జమ చేస్తున్న డబ్బును తిరిగి తీసుకోవటానికి నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోందని కక్షిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పరిష్కారమైన తర్వాత కూడా నెలలు నెలలు పరిహారం కోసం నిరీక్షించాల్సి వస్తోందని, ఈ ఇక్కట్లన్నీ తొలగి చెక్కులు త్వరితంగా ఇచ్చేలా, అవి నిర్ణీత కాలవ్యవధిలో క్లియర్ అయ్యేలా చూడాలని క్లయింట్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!