పవన్ కల్యాణ్‌ను ఏకిపారేసిన తమ్మారెడ్డి
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటర్లు ఇవ్వాళ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. పవన్ ఇంత నీచంగా మాట్లాడతాడని తాను ఊహించలేదని అన్నారు. అతని వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోవాల్సిన పని లేదని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మనుషుల అక్రమ రవాణా అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.
వలంటీర్లు వేలాదిమంది మహిళలను అక్రమంగా రవాణా చేశారంటూ పవన్ కల్యాణ్ ఆరోపించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. వాలంటీర్లపై ఇంత నీచంగా మాట్లాడితే ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. వేలాది మంది మహిళలు వలంటీర్ల వల్ల అదృశ్యమౌతుంటే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు, గానీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఆపకుండా ఉంటాయా? అని పేర్కొన్నారు.
వలంటీర్లు వేతనాల కోసం పనిచేయట్లేదని, వాళ్ల వల్ల సమాజంలో పెను మార్పులు సంభవించాయని, వ్యవస్థకు మేలు జరుగుతోందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అలాంటి వారిని కించపరిచేలా పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ సమర్థించలేరని చెప్పారు. వలంటీర్లు అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారడం ఆయన స్థాయికి తగదని అన్నారు.
మహిళలను అక్రమంగా రవాణా చేస్తోన్నట్లు పవన్‌కు ఢిల్లీ నుంచి నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడటం రాజకీయ నాయకుడి లక్షణం కాదని పేర్కొన్నారాయన. పవన్ కల్యాణ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications