జగన్‌తో గౌతమ్ అదాని కీలక భేటీ: ఆ రెండు ప్రాజెక్టులు ప్రతిష్ఠాత్మకం
అమరావతి: సాగరనగరం విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు శరవేగంగా ఏర్పాటవుతోంది. కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 14,000 కోట్ల రూపాయలతో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చేపట్టిన భారీ ప్రాజెక్ట్ ఇది.
ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ఏడు సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక- 24,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ ను నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో 130 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అదే సమయంలో 20 సంవత్సరాల పాటు పన్ను రాయితీని కూడా ఇవ్వడానికి అంగీకరించింది. అటు గంగవరం పోర్ట్‌లో పెట్టుబడులు పెట్టనున్నారు అదాని. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టును అభివృద్ధి చేయడంలో భాగంగా ఇందులో వాటాలను కొనుగోలు చేయడానికి అదాని ముందుకొచ్చింది.

పోర్టు ప్రమోటర్‌గా ఉన్న డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి ఇందులో 58.1 శాతం వాటా ఉండేది. వార్‌బర్గ్- పిన్‌కస్‌కు 31.5 శాతం, ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉండేది. ఈ వాటాలన్నింటినీ 6,200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఏపీ సెజ్. అదాని గ్రూప్ సంస్థల్లో ఒకటి అయిన ఏపీ సెజ్ 2021 సెప్టెంబర్‌లో వాటాలను తీసుకుంది.
అదాని డేటా సెంటర్ నిర్మాణ పనులు, గంగవరం పోర్ట్ ట్రస్ట్‌లో కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది అదాని యాజమాన్యం. ఇందులో భాగంగా గౌతమ్ అదాని ఈ సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో తమ సంస్థకు గల ప్రాజెక్టులపై చర్చించారు. అదాని డేటా సెంటర్‌ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ వివరాలను వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశారు అదాని.












Click it and Unblock the Notifications