తిరుమలలో అరుదైన ఘట్టం.. 15 రోజుల పాటు
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 75,082 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,686 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

తిరుమలలో 15 రోజుల పాటు అరుదైన కార్యక్రమం జరుగబోతోంది. లోక కళ్యాణం కోసం ఈ నెల 28 నుండి డిసెంబర్ 13వ తేది వరకు తిరుమల వసంత మండపంలో షోడశదిన సుందరకాండ పారాయణ కార్యక్రమం ఏర్పాటు కానుంది. దీనికి 27వ తేదీన సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల మధ్య ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఈ పారాయణంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 9.30 తిరుమలలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం 9 నుండి 12 గంటల మధ్య ఆరాధన, అభిషేకం, హోమం, అనుష్టానం నిర్వహించనున్నారు. డిసెంబర్ 13వ తేదిన ఉదయం 11 నుండి 12 గంటల మధ్య వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది.
మరోవైపు- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు.
సాయంత్రం 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 16 కళాబృందాలు 300 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వేంకటేశ్వర సంగీత- నృత్య కళాశాల, దాస సాహిత్య ప్రాజెక్ట్ కు చెందిన 300 మంది కళాకారులు, విద్యార్థులు వివిధ కళాప్రదర్శనలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications