చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి అవసరం..నారా లోకేష్‌పై జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఐదేళ్లు పూర్తికాలం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన అనుభవం, విజనరీతో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు మెచురిటీ ఉందని ఆయన పాలనలో అన్ని వర్గాలు ఆనందంగా ఉంటారని ఈ మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు.
నాకు తెలిసినంత వరకు చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండకపోవచ్చని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కొన్నాళ్లు సీఎంగా పని చేసిన తర్వాత ఆ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే అని జేసీ తెలిపారు.ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ గురించి నాకు పెద్దగా తెలియదని..ఆయన్ను నేను ఎప్పుడు కలవలేదని ఆయన వ్యాఖ్యనించారు. పవన్ ఇప్పుడే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారని ..మరో నెల తర్వాత ఆయన పరిపాలన, విధానాలపైన కామెంట్స్ చేయవచ్చని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే నాకు తెలిసినంత వరకు పవన్ ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనాసాగలేరని జేసీ చెప్పుకొచ్చారు.
ఆయనకు రాజకీయాలకు కన్నా సినిమాలే బెటరని.. పవన్ ఆర్ధికంగా బలంగా ఉండలంటే సినిమాలే కరెక్ట్ అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జేసీ ట్రావెల్స్ సైతం మూతపడిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జేసీ దివాకర్ రెడ్డి ..ఇటీవల జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తమ్ముడు కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం జీసీ దివాకర్ రెడ్డి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications