సిగ్గుచేటు: కెసిఆర్‌పై డికె అరుణ, కుక్కలమేనన్న షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని కె చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
సమస్యలను ప్రశ్నించిన వారిని కుక్కలనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానించేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమ నేతగా కేసీఆర్ ఏది మాట్లాడినా చెల్లిందని, ఇప్పుడు అలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. కేసీఆర్‌కు ప్రజలే గుణపాఠం చెప్తారని డీకే అరుణ హెచ్చరించారు.
మాది కుక్కజాతే.. మీది ఏజాతో?: షబ్బీర్

ప్రజలకు విశ్వాసంగా ఉండటంలో కాంగ్రెస్ నేతలది కుక్క జాతేనని.. మీది ఏజాతో సిఎం కెసిఆర్ చెప్పాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వేడుకలు నిర్వహించిందని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా ఇంతవరకు కెసిఆర్ పరామర్శించలేదన్నారు.
విద్యుత్ సమస్యపై మంత్రి కెటి రామారావుతో బహిరంగ చర్చకు సిద్ధమని అలీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ఉత్పాదనతో చర్చించేందుకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ముక్కు ఎవరు నేలకు రాస్తారో చర్చ తర్వాత తేలుతుందన్నారు. విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు నుంచి 440 మెగావాట్ల విద్యుత్ తేవడంలో కెసిఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications