ముఖ్యమంత్రి జగన్ అంటే... అంత ఆషామాషీగా ఉందా ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలోనే ఉంటారని, లేదంటే ఇంట్లోనే ఉంటారని, ఆయన బయటకు రారని, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమమైతేనే వస్తారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను కలవాలా? లేదంటే వారితో పిచ్చాపాటి కబుర్లేమైనా చెప్పాలా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

మౌనంగా తనపని తాను చేసుకుపోతున్న ముఖ్యమంత్రి
జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో ఉన్నా, క్యాంప్ కార్యాలయంలో ఉన్నా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రాజకీయంగా పార్టీ బలోపేతంపై దృష్టిపెడుతున్నారని, అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తుంటారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. జగన్ ఇంట్లోనే ఉంటారు అని ప్రతిపక్షాలుకానీ, ఆయనంటే గిట్టనివారుకానీ అనుకోవడంలో తప్పులేదని, వారు అలా అనుకుంటానే ఉంటారు.. ఇటువైపు ఆయన తన పని తాను చేసుకుపోతూనే ఉంటారన్నారు. మైండ్‌గేమ్ ఆడటంలో సిద్ధహస్తుడైన జగన్ మరోసారి తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలకు సీట్లు గల్లంతు?
ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది? ఎవరిపై సానుకూల అభిప్రాయం ఉంది? మంత్రుల పరిస్థితి ఏమిటి? తదితర విషయాలన్నీ ఆయన కూలంకుషంగా తెలుసుకుంటున్నారని, అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు గల్లంతయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వనని జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ప్లీనరీలో నివేదికలను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్న జగన్!
జులై 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యేలపై తెప్పించుకున్న నివేదికలను వారిముందు ఉంచబోతున్నారు. పనితీరు మార్చుకున్నవారికే సీట్లుంటాయని ఖరాఖండీగా చెప్పేయబోతున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది? అక్కడ వారికి అనుకూలంగా ఉన్న అంశాలేంటి? అనుకూలంగా ఉండే నేతలెవరు? వారి బలాబలాలేంటి? ఆయా నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? తదితర విషయాలన్నింటినీ పార్టీ నేతలతో చర్చిస్తారని, చర్చల్లో ఒక స్పష్టత వచ్చినదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని పార్టీనేతలు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు జగన్ ఇంట్లోనే ఉంటారు.. బయటకు రారు.. అంటూ చేసే ప్రచారాన్ని మానుకుంటే వారికే మంచిదని హితవు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications