ఎంత వర్షం కురుస్తున్నా రైళ్లు ఎందుకు ఆగవో తెలుసా?
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ జాబితాలో ఇండియన్ రైల్వే నాలుగో స్థానంలో నిలుస్తోంది. ప్రతిరోజూ కొన్ని లక్షల మందిని వారి వారి గమ్య స్థానాలకు రైల్వే చేరవేస్తుంటుంది. విమానం, బస్సులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో పోలిస్తే రైళ్లలో సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. రైల్వే శాఖ నివేదిక ప్రకారం భారత రైల్వే 13,523 రైళ్లను నడుపుతోంది. ప్రతి రైలు సమయానికే బయలుదేరుతుంది. సమయానికి చేరుకుంటుంది. ఏదైనా ఘోర విపత్తు సంభవిస్తే తప్ప సాధారణంగా రైళ్లు ఆగవు.
ఎంత పెద్ద వర్షం కురుస్తున్నా రైళ్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. భారీ వరదలు సంభవించి ట్రాక్‌లు కొట్టుకుపోతే తప్ప రైళ్లు రద్దవడం అనేది జరగదు. భారీ వర్షం కురుస్తున్నప్పుడు ప్రయాణించే రైళ్లపై పిడుగులు పడితే ఏం జరుగుతుంది? రైలుపై పిడుగు పడితే అందులో ప్రయాణించే వారు సురక్షితంగానే ఉంటారా? అనే సందేహాలు అందరికీ కలుగుతాయి.

రైలు మీద పిడుగు పడినా ఏమీ కాదు. ఎందుకంటే.. రైలు బయటి భాగాన్ని ఇనుము, ఉక్కుతో, లోపలి భాగాన్ని చెక్కతో తయారు చేస్తారు. ఐరన్‌తో చేసిన రైలుపై పిడుగు పడినా ఎటువంటి హాని వాటిల్లదు. కదులుతున్న రైలుపై పిడుగు పడినా లోపల కూర్చున్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు. కేవలం ఐరన్ మాత్రమే కాదు.. ప్రతి రైలులోనూ ఎర్తింగ్ పరికరం కూడా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ రైలుపై శక్తివంతమైన పిడుగు పడినపుడు అది ఎర్తింగ్ పరికరం ద్వారా ప్రయాణించి నేరుగా భూమి మీదకు వెళుతుంది. ఎంత భారీ వర్షం కురిసినా, ఎంత పిడుగులు పడినా రైలుకు ఏమీకాదు. ప్రయాణికులంతా సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.












Click it and Unblock the Notifications