కాపులూ జాగ్రత్త! పురంధేశ్వరివి ఏం మాటలు: బిజెపి నేతలపై డొక్కా
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతలకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. మిత్ర ధర్మానికి విరుద్ధంగా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బిజెపి నేతలు చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు. రాజకీయంగా ఉనికి లేనప్పుడే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజకీయ నేతలా కాకుండా కాగ్ ప్రతినిధిగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాయలసీమ విషయంలో మరోసారి తప్పటడుగులు వేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్, బిజెపిలకు డొక్కా విజ్ఞప్తి చేశారు.

కాగా, ఇటీవల బిజెపి నేతలు ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాసిన వివాదాస్పద పుస్తకావిష్కరణలో పురంధేశ్వరి పాల్గొన్నారు.
జోగయ్య పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో టిడిపికి ఆదరణ తగ్గుతోందని కావూరి సాంబశివ రావు అన్నారు. ఈ నేపథ్యంలో డొక్కా బిజెపి నేతల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications