ఏపీలో గణేశ్ విగ్రహాలపై ఆంక్షలు- మతం రంగు పులిమేస్తున్న బీజేపీ- రంజాన్‌తో పోలుస్తూ..
ఏపీలో వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున ఊరూవాడా గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. చవితి సందర్బంగా ఏర్పాటయ్యే ఈ విగ్రహాలు దాదాపు వారం నుంచి పది రోజుల పాటు అలాగే ఉంటాయి. భక్తులు భారీగా తరలివచ్చి దర్శనాలు చేసుకుంటారు. అయితే ఈసారి కరోనా కారణంగా ప్రభుత్వం గణేశ్ విగ్రహాల ఏర్పాటును నిరాకరిస్తోంది. సాధ్యమైనంత తక్కువ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయాన్ని వెల్లడించకపోయినా స్ధానికంగా పోలీసు అధికారుల ద్వారా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇప్పిస్తోంది. దీంతో గణేశ్ మండపాల నిర్వాహకులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వినాయక విగ్రహాలు, మండపాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దని ప్రభుత్వానికి సూచిస్తోంది. ప్రజలు సామూహికంగా జరుపుకునే చిన్నచిన్న మండపాల విషయంలో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. పండుగలను ప్రభుత్వం మత, ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదని ఆయన తెలిపారు. చవితి మతాలకు సంబంధించిన అంశం కాదని, ప్రభుత్వం మాత్రం మత కోణంలోనే చూస్తోందని విష్ణు విమర్శించారు.

రంజాన్ మాసంలో ప్రభుత్వం అనేక చర్యలు, అభిప్రాయాలు తీసుకుందని, ఇప్పుడు కూడా అలాగే చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ప్రజల విశ్వాసాలు, బాధ్యతను గుర్తు చేసే పండుగలను ప్రభుత్వం అడ్డుకోవద్దని ఆ పార్టీ నేత విష్ణు తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం మత పెద్దలు, స్వామీజీ లు, మఠాధిపతులతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications