జగన్‌కు వద్దు: చిరు, కడుపు నిండింది: బాలకృష్ణ భార్య
నెల్లూరు/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేస్తే గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి సోమవారం అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఆనంకు ఓటేయాలన్నారు. ఆత్మకూరును ఆనం అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. సింహపురిని రాజధానిగా చేయవచ్చునని చిరంజీవి వ్యాఖ్యానించారు.

కడుపు నిండిపోయింది: వసుంధర
హిందూపురం నియోజకవర్గం ప్రజలు, బంధువుల ఆప్యాయత చూస్తుంటే తన కడుపు నిండిపోయినట్లుగా ఉందని హీరో, హిందూపురం అసెంబ్లీకి టిడిపి తరఫున పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర అన్నారు. తన మావయ్య ఎన్టీ రామారావు ప్రాతినిథ్యం వహించిన హిందూపురంలో ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు.
హిందూపురం వాసులంతా తమ బంధువుల్లా అనిపిస్తున్నారన్నారు. తమ మావయ్యను ఆదరించినట్లుగానే తన భర్త బాలకృష్ణను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని వసుంధర చెప్పారు. కాగా బాలయ్య తరఫున కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications