రెండు జిల్లాలు కలిసినా తెలంగాణ.. తెలంగాణే: డిగ్గీ ట్విస్ట్
న్యూఢిల్లీ: తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపినా రాష్ట్రం పేరు తెలంగాణ అనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు. రాయల తెలంగాణ కావాలని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజాప్రతినిధులు జివోఎంకు చెప్పి ఉండవచ్చునని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు సిడబ్ల్యూసి తీర్మానం చేయగా ఇప్పుడు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపితే అది రాయల తెలంగాణ అవుతుంది కదా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తెలంగాణ.. తెలంగాణగానే ఉంటుందని, ఆ జిల్లాలను కలిపినా అది తెలంగాణగానే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు.

మంత్రుల బృందం నివేదికలో ఏముందో తనకు తెలియదన్నారు. ముసాయిదా బిల్లును తాను చూడలేదని చెప్పారు. అవి బయటకు వచ్చాక, బిల్లును ఎపి అసెంబ్లీకి పంపించాక స్పందిస్తానని చెప్పారు. కేబినెట్ సమావేశమైన వెంటనే ముసాయిదా బిల్లును అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపిస్తారని, శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
రాయల తెలంగాణకు సంబంధించిన అంశాన్ని తోసిపుచ్చలేమని డిగ్గీ అన్నారు. రాయల తెలంగాణపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, జివోఎం భేటీ అనంతరం స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించిన అంశాలపై తాను బయటకు చెప్పలేనని, అవి ప్రయివేటు విషయాలన్నారు.












Click it and Unblock the Notifications