రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం - జూలై 25..ఆ సెంటిమెంట్..!!
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతల స్వీకరణకు రంగం సిద్దమైంది. రేపు (జూలై 25) దేశ 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజగా జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా పైన ఎన్డీఏ అభ్యర్ధి ముర్ము విజయం సాధించారు. ఇక, 25వ తేదీనే రాష్ట్రపతిగా ముర్ము ఎందుకు ప్రమాణ స్వీకార ముహూర్తంగా ఖరారు చేశారనేది ఇప్పుడు చర్చ. దీని వెనుక కారణాల పైన అన్వేషిస్తున్నారు. ద్రౌపదీ ముర్ము జూలై 25న ఉదయం 10.14 గంటలకు రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.

రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం
సీజేఐ ఎన్వీ రమణ కొత్త రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధానితో పాటుగా దేశంలో ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే, జూలై 25న రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఇప్పుడు నిర్ణయించిన విషయం కాదు. దేశానికి తొలి రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న బాధ్యతలు స్వీకరించారు. ఆయర రెండో టర్మ్ కొనసాగారు. ఆ తరువాత పలు తేదీల్లో పలువురు రాష్ట్రపతులుగా బాధ్యతలు చేపట్టిన వారు పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. అందులో డాక్టర్ జాకీర్ హుస్సేన్.. ఫకృద్దీన్ అలీ అహ్మద్ కూడా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు.

జూలై 25 సెంటిమెంట్ ...ఇలా
ఆరో రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి జూలై 25, 1977న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో మొదలు ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పని చేసిన వారంతా పూర్తి కాలం పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి జూలై 25 అయిదేళ్ల పదవీ కాలం ముగిసి.. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాటానికి రాజ్యంగ పరంగా తేదీగా ఫిక్స్ అయింది. అదే సమయంలో సెంటిమెంట్ గానూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మది మంది రాష్ట్రపతులు జూలై 25న తమ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త రాష్ట్రపతిగా ముర్ము సైతం ఇదే రోజున బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళ
నీలం సంజీవరెడ్డి తరువాత రాష్ట్రపతులుగా పని చేసిన జైల్ సింగ్.. ఆర్ వెంకట్రామన్.. శంకర్ దయాల్ శర్మ..కేఆర్ నారాయణన్.. అబ్దుల్ కలాం.. ప్రతిభా పాటిల్...ప్రణబ్ ముఖర్జీ.. నేటితో పదవీ విరమణ చేసిన రాంనాధ్ కోవింద్ సైతం జూలై 25నే ప్రమాణ స్వీకారం చేసారు. దీంతో...ఇప్పటి వరకు జూలై 25న రాష్ట్రపతులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి సంఖ్య తొమ్మది మంది కాగా.. ఇప్పుడు ద్రౌపదీ ముర్ము సైతం ఇదే రోజున బాధ్యతలు స్వీకరిస్తుండంతో ఈ సంఖ్య పదికి చేరింది. 2029 వరకు ముర్ము రాష్ట్రపతిగా కొనసాగనున్నారు. ఇక, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ముర్ము ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత రాష్ట్రపతి భవన్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications