క్లాసుకు రాలేదని బాత్‌రూంలో విద్యార్థినుల నిర్బంధం
కృష్ణా: విద్యాబోధన చేస్తున్న సమయంలో విద్యార్థినులు తరగతి గదులకు హాజరుకాలేదని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు వారిని బాత్‌రూమ్‌లో 3 గంటలపాటు నిర్బంధించింది. కృష్ణా జిల్లా ఎ కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరగ్గా సోమవారం వెలుగుచూసింది. కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఎన్ అంజలీదేవి ఉదయం 10వ తరగతి బాలికలకు స్టడీఅవర్‌కు హాజరుకావాలని ఆదేశించింది.
ఆ సమయంలో దుర్గా భవానీ, రాణి, ఝాన్సీ, శ్వేత బాత్‌రూమ్‌లో స్నానాలు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆమె 9 నుండి మధ్యాహ్నం 12. 30 వరకు బాత్‌రూమ్‌లకు తాళాలు వేసేసింది. బాలికలకు లోపల ఊపిరాడక కేకలు వేశారు. గమనించిన హెడ్‌కుక్ శ్రీదేవి మంచినీటి బాటిల్‌ను కిటికీలోంచి అందించింది. ఆ నీటితో బాలికలు దాహం తీర్చుకున్నారు.

3గంటల తరువాత శాంతించిన ఉపాధ్యాయురాలు బాత్‌రూమ్ తలుపులు తీయడంతో బాలికలు బయటపడ్డారు. విజయవాడలో ఉన్న ప్రత్యేకాధికారిణి ఎం వెంకటలక్ష్మికి ఈ విషయాన్ని పలువురు ఫోన్ ద్వారా చెప్పారు.
ఆమె వెంటనే స్పందించి జిసిడిఓ గాయత్రికి ఫిర్యాదు చేయగా ఆమె పిఓ పుష్పారాణికి తెలియపర్చారు. సోమవారం ఉదయం విద్యాలయానికి చేరుకున్న పిఓ బాధిత బాలికలను తీసుకుని స్థానిక తహశీల్దార్‌ని కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. ఇప్పటి వరకు ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications