ఆ రెడ్డి నేతలతోనే సమస్య - డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!!
సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. కోటీశ్వరులైన రెడ్లే తనను తిడుతున్నారని పేర్కొన్నారు. ఇంకెవరూ తనను వ్యతిరేకించటం లేదని చెప్పుకొచ్చారు. తన సహకారంతో పదవులు పొందిన వారే తనను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తన ద్వారా పదవులు పొంది తననే విమర్శించటం మంచిది కాదన్నారు. తాను గత ఎన్నికల్లో రెడ్ల వలనే గెలుపొందానని ఆ వర్గంలోని కొందరు నేతలు అర్దం లేని విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
మాజీ ఎంపీ, ప్రభుత్వ ఎన్ ఆర్ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన ద్వారా లబ్ది పొందని వారు ఎవరైనా ఉంటే రమ్మనండి అంటూ సవాల్ చేసారు. తన సహాయం పొందని వారుంటే తన ముందుకు రావాలన్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో చేనేత కార్మికులకు మగ్గాల పంపిణీ కార్యాక్రమంలో డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసారు. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో మంత్రికి, ఎమ్మెల్యేకి సంబంధం లేదని చెబుతున్నారని, ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో అర్దం కావటం లేదన్నారు.

తాను పదవి కంటే ఆత్మాభిమానంతో బతుకుతానని నారాయణ స్వామి చెప్పారు. ఎవరికి తాను అన్యాయం చేసానో చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎం కాబట్టి తల వంచుకుపోతున్నానని చెప్పారు. తాను రెడ్ల సహకారంతోనే సమితి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు గెలుస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎవరైతే సీఎం జగన్ ను తిడుతారో వారినే తాను తిడుతున్నానని వివరించారు. ఎవరికైనా తాను అన్యాయం చేసి ఉంటే నేరుగా వచ్చిన మాట్లాడాలని హెచ్చరించారు. ఎవరూ బానిసలుగా బతకరాదనేది తన ఉద్దేశంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications