పవన్ కు చికిత్స పూర్తి, ప్రఖ్యాత ఆలయాల సందర్శన.. వరుసగా..!!
డిప్యూటీ సీఎం పవన్ పూర్తిగా కోలుకున్నారు. కేరళలో చికిత్స తీసుకున్న పవన్.. ఇప్పుడు అక్కడ ప్రఖ్యాత ఆలయాలను సందర్శిస్తున్నారు. సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామిని పవన్ సందర్శించారు. ఈ రోజు గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ అక్కడ ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. ఈ నెల 15న పవన్ తిరిగి ఏపీకి రానున్నారు. ఇక.. స్థానిక ఎన్నికల పైన పూర్తిగా ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు.
కేరళలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న పవన్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి స్వరాష్ట్రానికి రానున్నారు. ఈ సమయంలోనే కేరళలో ప్రఖ్యాత ఆలయాలను వరుసగా సందర్శిస్తున్నారు. కాగా, త్రిప్రయార్ శ్రీ రామస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు.

ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేదివజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు. ఇక, ఈ రోజు ఉదయం త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు.
ప్రముఖ ఆలయాల సందర్శన
ముందురోజు చేసిన అలంకరణతో స్వామిని చేసుకునే తొలి దర్శనాన్ని నిర్మాల్య సేవగా పిలుస్తారు. ఈ సేవ కోసం శనివారం ఉదయం వేకువజామున 3 గంటలకు పవన్ గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని తరించారు. అంతకు ముందు గురువాయూర్ చేరుకున్నపవన్ కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దక్షిణ ముఖద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించిన ఆయన, స్వామి నిర్మాల్య దర్శనం చేసుకున్నారు.

గర్భాలయంలో మూలవిరాట్టుకి నిర్వహించే ప్రత్యేక కైంకర్యాలు అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించారు. నిర్మాల్య దర్శనానంతరం సంప్రదాయం ప్రకారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. శంభాభిషేకం, వాకచార్థు సేవలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి పవన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నైరుతిలో ఉన్న వినాయకుడిని దర్శించుకుని, ఆలయ ఆచారాలను అనుసరిస్తూ గుడి వెనుక భాగంలో సాష్టాంగం చేశారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లను దర్శించుకున్నారు.













Click it and Unblock the Notifications
