ఆ ఎమ్మెల్యేలకు పవన్ మార్క్ వార్నింగ్ -సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు..!!
డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీకి నష్టం తెచ్చే చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. పార్టీ మూలాలు ఎవరూ మర్చి పోవద్దని స్పష్టం చేసారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారుచేశారని పవన్ చెప్పుకొచ్చారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లుగా చేయూతనిచ్చినవారినే తిడితే ఎలాగని పవన్ వ్యాఖ్యానించారు.
కూటమిగా మూడు పార్టీలూ కలిసే ఉంటాయని, అందులో అనుమానమేమీ పెట్టుకోవద్దని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ, బీజేపీతో కలిసే జనసేన ముందుకు నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు, ఎక్కడ, ఏమి మాట్లాడినా జాగ్రత్తగా వ్యవహరించాలని.. అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై, మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలని, దానిపై చట్టం తీసుకొచ్చేలా యత్నించాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

ప్రీతి అనుమానాస్పద మృతిపై మొదట స్పందించి, అక్కడకు వెళ్లి 2లక్షల మందితో సమావేశం నిర్వహించింది తమ అధినేతేనని పార్టీ నేతలు ప్రస్తావించారు. ఇదే అంశం పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీకి నష్టం తెచ్చే చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ హితవు పలికారు. వారి పనితీరుపై ఆయన ప్రత్యేకంగా సర్వే చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలను దాటి వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. పనితీరు మార్చుకుని, ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలని సూచించారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారుచేశారని పవన్ తెలిపారు. ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించానని పవన్ గుర్తుచేశారు.
నాడు తమ పోరాటాల ఫలితంగానే నాటి ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిందని పవన్ చెప్పుకొచ్చారు. చట్టప్రకారం సర్కారు నుంచి వారికి పరిహారాలు అందాయన్నారు. ఎకరా రూ.2కోట్ల విలువ చేసే ఐదెకరాలు, 5సెంట్ల ఇంటి స్థలం, ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం.. ఇవన్నీ తమ ఒత్తిడి కారణంగానే అందాయని తెలిపారు. సీబీఐ దర్యాప్తు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం లాకర్‌లో పెట్టిందన్నారు. ఉపముఖ్యమంత్రి అయ్యాక డీజీపీ, హోం మంత్రితో మాట్లాడి త్వరగా న్యాయంచేయాలని కోరినట్లు చెప్పారు. సీఐడీ విచారణలో అనుమానితుల డీఎన్‌ఏలు సరిపోలడం లేదని తెలిసిందని.. సాక్ష్యాలు కూడా తారుమారు చేశారని తెలిపారు.












Click it and Unblock the Notifications