Ysrcp: ఎమ్మెల్సీ అనంతబాబు అడుగులకు మడుగులొత్తిన పోలీసులు?
హత్య జరిగిన వెంటనే విస్త్రతమైన గాలింపు జరిపి నిందితుణ్ని పట్టుకోవడంతోపాటు బాధిత కుటుంబానికి ఊరట కల్పించడం ప్రతి పోలీసు కనీస బాధ్యత. కానీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ విషయంలో పోలీసులు తమ బాధ్యతలను గాలికొదిలేశారనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. న్యాయపరమైన వెసులుబాటును కల్పించేందుకే నాలుగురోజులపాటు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేశారని, అందుకు వారిపై అధికార పక్షం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అండగా నిలబడ్డారు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అనంతబాబును ఈ కేసు నుంచి తప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. అరెస్ట్ లో జాప్యం చేసింది కూడా అందుకేనన్నారు. సుబ్రమణ్యం హత్యకు సంబంధించి పోలీసులు మొదట్లో బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని, పోస్టుమార్టం నివేదిక వెల్లడైన తర్వాత 201, 302 కింద తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని, అంతేకాకుండా అనంతబాబును అరెస్ట్ చేయక తప్పదు అనే పరిస్థితి వచ్చిన తర్వాతే అరెస్ట్ చేశారుకానీ లేదంటే ఇప్పటికీ అతను అజ్ఞాతంలోనే ఉండేవారని చెబుతున్నారు.

ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినా ప్రయోజనం శూన్యం
సుబ్రమణ్యం హత్య జరిగిన తర్వాత పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు హాజరవుతున్నారు. అయినా అరెస్ట్ చేయలేదు. హత్య జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పారు? ఎవర్ని ఆశ్రయించారు? తదితర వివరాలన్నీ అతని కాల్ డేటా ఆధారంగా లభ్యమయ్యేవని, కానీ నాలుగురోజలుపాటు తాత్సారం చేయడంవల్ల ఇటువంటి విషయాన్నింటి నుంచి అనంతబాబుకు వెసులుబాటు కల్పించినట్లైందని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

మీడియాను తప్పుదోవ పట్టించిన పోలీసులు
పోలీసులు చివరకు మీడియాను కూడా తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. అనంతబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే క్రమంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియా దృష్టిని మరల్చారని, జిల్లా పోలీసు కార్యాలయానికి సమీపంలోనే ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకొని అక్కడే ఉంచారని, కానీ ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదని సమాచారం. ఇలా అన్నిరకాలుగా పోలీసులు అనంతబాబు అడుగులకు మడుగులు ఒత్తేలా వ్యవహరించారేకానీ ఒక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే దృక్పథం మాత్రం వారిలో కనపడలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది..!!