హై అలర్ట్, పల్నాడులో పగిలిపోతుందని వార్నింగ్, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రిలో అలా!
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన తరువాత కూడా పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవలు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలు ఎక్కువ కావడంతో ఆ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు పలు ప్రాంతాలపై ఎన్నికల అధికారులు నిఘా వేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండో రోజు కొనసగాడంతో ఈసీ సీరియస్ అయ్యింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలుల చెయ్యాలని ఆ జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పల్నాడు జిల్లా పాలనాధికారి శివశంకర్ వెంటనే 144 సెక్షన్ అమలు చెయ్యాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

నరసారావుపేట లోక్ సభ నియోజక వర్గంతో పాటు మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల్లో మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంది. ముగ్గురి కంటే ఎక్కువ మంది గుమికూడటం, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది గుమికూడితే గూబ గుయ్ మంటుందని పోలీసు అధికారులు అన్ని పార్టీల కార్యకర్తలను హెచ్చరించారు.
పల్నాడు జిల్లాతో పాటు తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని సమస్యాత్మాక అసెంబ్లీ నియోజక వర్గాలపై ఈసీ నిఘా వేసింది. ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు, పోలీసు శాఖతో మాట్లాడిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది.
అవసరం అయితే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఈసీ ఆలోచిస్తోందని సమాచారం. తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీ ఆవరణంలోనే మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని, వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications