ED విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
కథానాయకుడు విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. కొద్దినెలల క్రితం ఆయన కథానాయకుడిగా 'లైగర్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈడీ విచారణకు ఆ చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్, ఛార్మి హాజరుకాగా, ఇప్పుడు విజయ్ హాజరయ్యారు.
లైగర్ సినిమాకు సంబంధించిన వ్యవహారం జాతీయస్థాయిలో దుమారం రేగింది. ఈ సినిమాకు పెట్టుబడిగా పెట్టడానికి అవసరమైన నగదును దుబాయికి పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సినిమా నిర్మాణంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే 'లైగర్' సినిమా నిర్మాణంలో భాగస్వాములైన వారినందరినీ పిలిపించి విచారిస్తున్నారు.

లైగర్ సినిమా తర్వాత జనగణమణ చిత్రాన్ని కూడా రూపొందించే ఉద్దేశంతో అందులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. వీటికోసమే రూ.20కోట్లు ఖర్చుపెట్టారు. లైగర్ సినిమా నిర్మాణంలో కూడా ఈ చిత్రంలోని సన్నివేశాలను రూపొందించడానికి ఆర్థిక సహాయం చేసినవారిని గుర్తిస్తున్నారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడివున్నట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. హిందీలో ఈ సినిమాకు కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ముఖ్యంగా ఆ రాజకీయ నేత కోసమే వీరందరినీ విచారించుకుంటూ వస్తున్నారు. సదరు రాజకీయ నేతకు, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం ఉందనేది ఈడీ అధికారుల అనుమానం.












Click it and Unblock the Notifications