ఏపీలో ఎన్నికలపై ఈసీ సంకేతాలు - తొలి విడతలోనే..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షాలు అదే అభిప్రాయంతో ఉన్నాయి. ఈ సమయంలోనే ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు కీలక సంకేతాలు అందుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల సంఘం ఫోకస్: ఏపీలో ఎన్నికల పైన కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించింది. కాగా, ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 9,10 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఏపీలో పర్యటించనుంది. సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది.

ఈ పర్యటనలో ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా సిద్ధం కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, ఫిర్యాదులపై విచారణను అధికారులు పరిశీలన చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలి దశలోనే ఏపీ ఎన్నికలను ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 20వ తేదీ తరువాత ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి.
తొలి విడతలోనే ఛాన్స్: దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో భాగంగా ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు, అలాగే తమిళనాడు లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈసీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికార వర్గాల సమాచారం.
జనవరి 7వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్ర పర్యటన ద్వారా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కసరత్తులు మొదలుపెట్టనుంది. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లతో పాటుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉన్న 175 స్థానాలతో పాటు 25 లోక్‌సభ సీట్లకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఏపీకి ఎన్నికల అధికారులు: ఆరుగురు అధికారులతో కూడిన సీఈసీ బృందం ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రానికి చెందిన ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతోపాటు, జాబితాల్లో తప్పులు, అవకతవకలు తదితర అంశాలపై సీఈసీ బృందం సమీక్షించనుంది.
2019 ఎన్నికల సమయంలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమై.. మే 19వ తేదీతో లోక్‌సభ తో పాటుగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో 2024 ఎన్నికలను కూడా ఆరు లేదంటే ఏడు విడతల్లో నిర్వహించాలని ఈసీ అనుకుంటోందని సమాచారం. దీంతో, ఏపీలో ఎన్నికల రాజకీయంగా మరింత ఆసక్తి కరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications