పిఠాపురంకే డిప్యూటీ సీఎం - ఫుల్ క్లారిటీ...!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై పార్టీలకు క్లారిటీ వచ్చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్దులు దాదాపు స్పష్టతతో ఉన్నారు. హోరా హోరీగా పోలింగ్ సాగిన కొన్ని నియోజవర్గాల్లో మినహా మిగిలిన సెగ్మెంట్లలో గెలుపు, ఓటమి పైన అభ్యర్దులకు పరిస్థితి అర్దమైంది. ఫలితం వెల్లడయ్యే వరకూ అందరూ గెలుస్తున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పిఠాపురంలో గెలుపు ఎవరిదనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కానీ, ఎవరు గెలిచినా పిఠాపురంకు పదవి మాత్రం ఖాయం.
పిఠాపురంలో గెలుపెవరిది
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఫిఠాపురం పైన ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిన పవన్ ఈ సారి భారీ మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్ట దలతో ఉన్నారు. జనసైనికులు పవన్ ను గెలిపించేందుకు శక్తిమేర పని చేసారు. అధిక మెజార్టీ సాధించాలనే పట్టుదలతో కనిపించారు. ఇటు వంగా గీత కోసం వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. వంగా గీత తన గెలుపు పైన ధీమాతో ఉన్నారు. అయితే, పిఠాపురంలో 2019లో 80.99 పోలింగ్ నమోదు కాగా, 86.63 శాతం పోలింగ్ జరిగింది. దీంతో, మెజార్టీ పైన అంచనాలు పెరుగుతున్నాయి. పిఠాపురంలో 2009 నుంచి 2019 ఎన్నికల వరకు లెక్కలు గమనిస్తే ఆసక్త కర అంశాలు వెలుగుతోకి వస్తున్నాయి.

మెజార్టీ పైన ఫోకస్
ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన సమయంలో 46,623ఓట్లు రాగా అప్పుడు వర్మ పైన 1,036 ఓట్లతో విజయం సాధించారు. అదే ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడకు కు 43, 341 ఓట్లు పోలయ్యాయి. 2019లో పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబు 83,459 ఓట్లు దక్కించుకున్నారు. కాగా.. 14,992 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మకు 68,467 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారికి 28011 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వర్మ జనసేనకు మద్దతుగా నిలవగా.. శేషకుమారి వైసీపీలోచేరారు. అంచనాలకు మించి పోలింగ్ జరిగింది. ఇక..పవన్ అధిక మెజార్టీతో గెలుపు ఖాయమని జనసేన...అనూహ్య ఫలితం రాబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

డిప్యూటీ సీఎం ఖాయం
అయితే, పిఠాపురం నుంచి పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే జనసేనాని డిప్యూటీ సీఎం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ తిరిగి అధికారంలో కొనసాగితే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని పార్టీ నేతల సమాచారం. ప్రచారంలో భాగంగా చివరి రోజున పిఠాపురంలో జగన్ తన అభ్యర్ది వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు వంగా గీత గెలిచి..వైసీపీ అధికారంలోకి వస్తే గీతకు డిప్యూటీ సీఎం ఖాయం. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చి గీత ఓడినా..కాపు వర్గానికి చెందిన మహిళగా గీతకే డిప్యూటీ సీఎం పదవి ఖాయమని వైసీపీలో చర్చ జరుగుతోంది. దీంతో...ఎవరు గెలిచినా..ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా..పిఠాపురం కు డిప్యూటీ సీఎం పదవి మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications