ఏపీలో ఎన్నికల తేదీలు ఖరారు - అధినేతల అలర్ట్..!?
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే వైసీపీ సిద్దం సభలతో కేడర్ ను ఎన్నికల యుద్దానికి సిద్దం చేస్తోంది. ఎన్నికల నిర్వహణ పైన ఢిల్లీ నుంచి కీలక అప్డేట్ అందుతోంది. షెడ్యూల్, పోలింగ్ తేదీల పైన పార్టీలు అంచనాకు వచ్చాయి. దీంతో, అధినేతలు అలర్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ - జనసేన అభ్యర్దుల జాబితా విడుదలకు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈసీ కసరత్తు: ఎన్నికల నిర్వహణ పై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీ లోపు ముగియనుంది. 13వ తేదీ తర్వాత ఏ క్షణమైన లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మొహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికలు అప్పుడేనా: ఇక, ఏపీలోనూ ఎన్నికల తేదీల పైన స్పష్టత వస్తోంది. 2019 లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి మార్చి 13 తరువాత షెడ్యూల్ విడుదల అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15 -20 మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా..ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగంచుకోవటానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రజల్లోకి ముఖ్య నేతలు: ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..అందుతున్న సంకేతాలతో ఏపీలో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అందులో భాగంగా మరింత ఆలస్యం చేయకుండా టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా ఈ రోజు విడుదల చేసేందుకు సిద్దమయ్యాయి. బీజేపీతో పొత్తు కారణంగా అన్ని సీట్లు ప్రకటించకుండా, ఖాయమైన సీట్లను ప్రకటించాలని నిర్ణయించారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఈ రోజు స్పష్టం కానుంది.
బీజేపీ కేటాయించే సీట్ల పైన చంద్రబాబు - పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం తరువాత సీట్లు..ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయించారు. దీంతో..ఇక ఏపీలో ఎన్నికల ముహూర్తం పైన దాదాపు క్లారిటీ రావటంతో..ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్య నేతలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications