శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- కొత్త పథకానికి టీటీడీ శ్రీకారం
Tirumala: శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 81,626 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,304 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.14 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. ఈ వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. భక్తులకు అందించడానికి వీలుగా 10 ప్యాకెట్ సైజ్ పుస్తకాలను బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల వాహన మండపంలో మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. చంద్రప్రభ వాహన సేవానంతరం పుస్తక ప్రసాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ పాకెట్ సైజ్ పుస్తకాలన్నింటినీ కూడా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ముద్రించాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శ్రీనివాసుని దివ్య కథ, భజగోవిందం, శ్రీ శంకరాచార్య కృత స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, శ్రీమద్ భగవద్గీత, రథసప్తమి, మహాశివరాత్రి, కార్తీక వైభవం తదితర పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందిస్తారు. ఆవిష్కరణ అనంతరం వాటిని చంద్రప్రభ వాహనం సేవకు వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications