TTD: వైకుంఠ ఏకాదశి టికెట్లపై ఈవో కీలక ప్రకటన - ఇలా పొందండి..!!
Tirumala: తిరుమలలో ఈ సారి వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులకు దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం టికెట్ల అందుబాటులో ఉంచనున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పది రోజుల పాటుగా భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. అలిపిరి పాదాల మండపం శిదిలావస్థకు చేరుకుందని.. మండపాన్ని జీర్ణోద్ధారణ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
వైకుంఠ ఏకాదశి దర్శనం : ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకూ 10 రోజుల పాటు భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను ఈ నెల 10వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 10 రోజులకీ 2.25 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం.. రోజుకి 2వేలు చొప్పున 20 వేల శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను భక్తులకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వచ్చే నెల 21వ తేదీ వేకువజామున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో జారీ చేయనుంది. 10 రోజుల గానూ 4.25 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేయనుంది.

మండప జీర్ణోద్దారణ : అలిపిరి పాదాల మండపం శిదిలావస్థకు చేరుకుందని.. మండపాన్ని జీర్ణోద్ధారణ చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మండపం జీర్ణోద్ధారణపై టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి రాద్దాంతం చేస్తున్నారన్నారు. భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో ప్రధాన ఆలయంలో అనేక మార్పులు చేశారని.. ఆ సమయంలో అడ్డు చెప్పని భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు మండపం జీర్ణోద్ధారణకు ఎందుకు అడ్డు పడుతున్నారని అడిగారు. భానుప్రకాష్ రెడ్డికి ధైర్యం ఉంటే పార్వేట మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగా లేదని చెప్పగలరా అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రశ్నించారు.
పెరిగిన భక్తుల రద్దీ : తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం తిరుమల శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న(గురువారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ నెల 12న తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 -18 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు.












Click it and Unblock the Notifications