సీఎం జగన్ ను పొగిడి .. సోము వీర్రాజును ఇరకాటంలోకి నెట్టిన ఈటల రాజేందర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి నియోజకవర్గాల వారీగా ప్రజలసమస్యలు తెలుసుకుంటూ, వైసిపి ప్రజా వ్యతిరేక పాలనను ప్రజాక్షేత్రంలో చర్చకు పెడుతోంది. నియోజక వర్గాల వారీగా బిజెపి ఛార్జిషీట్ తయారుచేస్తూ ప్రజల్లోకి వెళుతుంది. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలను ఏకరువు పెడుతుంది. అధికార వైసీపీపై ఏపీ బిజెపి సమరశంఖం పూరిస్తుంటే, తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ బిజెపి నాయకులకు కంట్లో నలుసులా తయారయ్యాయి.
తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. ముఖ్యంగా బిజెపి కి తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేన, బిజెపిలు పోరాటం చేస్తుంటే, తెలంగాణ బిజెపి నేత ఈటల రాజేందర్ జగన్ పాలన శభాష్ అంటూ కొనియాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా సోము వీర్రాజు ను ఇరకాటంలో పెట్టినట్టైంది. నిన్న ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలకు లక్షలాది ఇళ్లు కట్టించి ఇస్తున్నాడని కొనియాడారు. కానీ ఇక్కడ కెసిఆర్ గజం జాగా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన కంటే జగన్ పాలన్ భేష్ అన్న చందంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కు తలనొప్పిగా మారాయి. బిజెపి ఎమ్మెల్యే ఈటల సీఎం జగన్ గురించి చేసిన వ్యాఖ్యల వీడియోను వైసిపి నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ ఈటల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనంతో ఉంది.
మరోపక్క ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ గా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను వైసిపి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications