ఏపీని రిపేరు చేయాలి: బెదిరింపులకు భయపడేది లేదంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి జాడ అనేదే లేకుండా పోయిందని, ఎక్కడా చూసిన విధ్వంసమేనని మండిపడ్డారు. రాక్షస పాలనతో ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు.

జగన్ సర్కారును గద్దెదించి.. ఏపీని రిపేరు చేయాలి: చంద్రబాబు
బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని పార్టీ శ్రేణులను అభినందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాడేపల్లి ప్యాలెస్‌లో పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సమష్టిగా పోరాడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన విధ్వంసం, రాక్షస పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు.

వైసీపీ బెదిరింపులకు టీడీపీ భయపడదంటూ చంద్రబాబు
ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, సంక్షేమం పేరుతో వైసీపీ సర్కారు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఎవరు మాట్లాడినా, ప్రశ్నించినా అక్రమ కేసులు, బెదిరింపులతో నోరు మూయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు టీడీపీ ఎప్పటికీ భయపడదని వ్యాఖ్యానించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట పరిహారం చెల్లింపులు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కేవలం 30 శాతం పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు. విత్తనాలు సరిగా పంపిణీ చేయకపోవడంతో దిగుబడి కూడా పడిపోయిందన్నారు.

కక్ష సాధింపు చర్యలతో అణచివేయలేరంటూ చంద్రబాబు ఫైర్
అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అంటూ ప్రచార ఆర్భాటం మాత్రం చేసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పాలన అనేదే లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలనే ఎజెండాగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి లేకపోవటంతో ఒక్కరూపాయి ఆదాయం లేక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తు భయపెట్టాలని చూస్తున్నారని..టీడీపీ దేనికి..ఎవ్వరికి భయపడదనే విషయం వైసీపీ పార్టీ నేతలు.సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇటువంటివి చాలానే చూశాం. పాలన చేయటం మానేసి కక్ష సాధింపుతోనే టీడీపీని అణచివేయాలని చూస్తే అది జరిగేపనికాదనే విషయం తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు.

జగన్, సజ్జలపై లోకేష్ తీవ్ర విమర్శలు
ఇది ఇలావుండగా, టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ? అంటే బ్రోకర్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు లోకేష్. సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటీ కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్ రెడ్డి.. ఇప్పుడు తన నేరసామ్రాజ్యాన్ని డ్రగ్స్ దంద వరకూ విస్తరించారని లోకేష్ ఆరోపించారు. తన తండ్రి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో తనపై కక్షకట్టి పెట్టిన ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు తప్పించి.. ఒక్క రూపాయి అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా? అని నిలదీశారు.












Click it and Unblock the Notifications