చంద్రబాబు, లోకేష్ ను కలిసిన వరల్డ్ కప్ స్టార్ శ్రీచరణి..! ఆఫర్ పై ఉత్కంఠ..!
తాజాగా భారత్ వేదికగా జరిగిన మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా అద్భుత ప్రదర్శనతో కైవసం చేసుకుంది. ఈ టీమ్ లో సభ్యురాలిగా ఉన్న కడప బౌలర్ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి వచ్చిన ఆమెకు మంత్రి నారా లోకేష్ సీఎం క్యాంపు కార్యాలయంలో స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అయిన ఆమె.. వరల్డ్ కప్ విశేషాలు పంచుకుంది.
ఈ ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీచరణికి హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు శ్రీచరణిని భారీ ర్యాలీగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీచరణి, మిథాలీ రాజ్‌ను సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ వెంటపెట్టుకుని వచ్చారు.

అక్కడ సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్ వరల్డ్ కప్ గెల్చుకున్న క్షణాల్ని, టోర్నీ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు మహిళల క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు వారికి తెలిపారు. మరోవైపు శ్రీచరణికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. జట్టులో చరణి తోటి క్రికెటర్లకు ఇప్పటికే ఆయా రాష్ట్రాలు నజరానాలతో పాటు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.

తాజాగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో కడప లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తద్వారా టీమిండియా చారిత్రాత్మక తొలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రీచరణి ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టింది. తద్వారా టోర్నీలో భారత్ తరపున రెండవ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గానూ నిలిచింది. ఏపీలోని కడప జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీచరణి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకుంది.












Click it and Unblock the Notifications