తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్రిమినల్ ముఠా నాయకుడు ఆయనే.. అంబటి సంచలనం!
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తొక్కిసలాట ఘటనపైన సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నేడు గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు కారణమైన టిటిడి చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీ లపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు.
తొక్కిసలాట ఘటనకు కారణమైన క్రిమినల్ ముఠా
కేవలం వైసీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం కోసమే ఆ నలుగురిని చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రిమినల్ ముఠాకు నాయకుడు చంద్రబాబునాయుడు అని ఆయన విమర్శించారు. ఈ ఘటనలో కిందిస్థాయి ఉద్యోగులపైన చర్యలు తీసుకోవడం దారుణమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రణాళిక లోపం కారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురై, మృతి చెందడం చాలా పెద్ద ఘటనగా భావించాలన్నారు.

చంద్రబాబు తిరుపతి పర్యటన అందుకే
ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీరియస్ గా చర్యలు ఉండాలని, కానీ చంద్రబాబు ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. సీఎం అనుకూల అధికారులుగా ఉన్న వారిని కాపాడడం కోసమే చంద్రబాబు తిరుపతి పర్యటన చేశారని, బాధితుల కోసం భక్తుల కోసం కాదని ఆయన అన్నారు.
చంద్రబాబు తర్వాత పవన్ తిరుపతికి వెళ్ళింది అందుకే
తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి తిరుపతికి వెళ్లే క్రమంలో కావాలనే వైయస్ జగన్ కు ఆటంకాలు సృష్టించారని ఆయన అన్నారు.
వైయస్ జగన్ కాలినడకన వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారన్నారు. ముందుగా చంద్రబాబు ఆ తర్వాత వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లడం ద్వారా సమయం లేకుండా చేయాలనే లక్ష్యంతోనే దిగజారుడు రాజకీయాలు చేశారని మండిపడ్డారు.
జగన్ ను బాధితులను కలవనివ్వకుండా చంద్రబాబు సర్కార్ కుట్ర
జగన్ ఎక్కడ బాధితులను కలిస్తే, వారికి వాస్తవాలు చెప్తే.. ప్రజలలో ఆగ్రహం బయటకు వస్తుందోనని ప్రభుత్వం భయపడిందని అంబటి రాంబాబు వెల్లడించారు. ఇక తమ పైన పెట్టిన తప్పుడు కేసులకు భయపడేది లేదని ఆ కేసుల కోసం పారిపోవాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్న అంబటి రాంబాబు తాను ఎప్పుడు, ఎక్కడికి రమ్మని ఫోన్ చేసినా వస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications