దీంతో మా పార్టీ పని అయిపోయినట్లేనా - బాలినేని..!?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రంలో వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు చేసారు. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసామని గుర్తు చేసారు. తాజాగా జరిగిన ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవగా.. పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలోనూ ఈ ఫలితాల పైన చర్చ సాగింది. ఇప్పుడు ఇదే అంశం పైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు.
వైసీపీ తొలిసారి టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్దానాల్లో పోటీ చేసిందని మాజీ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఎన్నికలోనూ ఇప్పటి వరకు ఓడిపోలేదని వివరించారు. ప్రతీ ఎన్నికలోనూ ఏకపక్షంగా విజయం సాధించామని చెప్పారు. ఉప ఎన్నికలు..స్థానిక-మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్ధులే గెలుస్తూ వచ్చారని గుర్తు చేసారు. 14 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అందు లో 9 స్థానిక సంస్థలు.. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలుపొందామని వివరించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలిచి..పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓడామని చెప్పుకొచ్చారు. తాము ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గెలిచినా ఎటువంటి ఆర్భాటాలు చేయలేదని బాలినేని పేర్కొన్నారు.

రెండు శాతం మాత్రమే ఓట్లు ఉన్న గ్రాడ్యుయేట్స్ లో గెలిచిన దానికి ఏదో జరిగిపోయిందని నానా హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటమి పైన పార్టీ తరపున పోస్టు మార్టం ఉంటుందని..ఎక్కడ లోపం జరిగిందనేది గుర్తించి సరి చేసుకుంటామని స్పష్టం చేసారు. రెండు ఎమ్మెల్సీల్లో ఓడినంత మాత్రాన పార్టీ పని అయిపోనట్లేనా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రజల్లో చాలా బలంగా ఉందని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ దుకాణం ఎత్తివేయాలి కదా అని వ్యాఖ్యానించారు. ఎప్పుడు పరిస్దితి ఒకేలా ఉండదని తెలుసుకోవాలంటూ లోకేష్ కు సూచించారు. ఓటింగ్ లో పాల్గొన్న గ్రాడ్యుయేట్స్ లో సంక్షేమ పధకాలు తీసుకున్న వాళ్లు లేరని చెప్పారు. గ్రాడ్యుయేట్స్ లో ఎందుకు వ్యతిరేకత ఉందో తెలుసుకుని ముందుకు వెళ్తామన్నారు. అన్నీ వర్గాలను సమానంగా చూసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని బాలినేని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications