మీ ప్రతిపాదనలిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడతాను..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎంపీగాకానీ, ఎమ్మెల్యేగాకానీ పోటీచేసేందుకు సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెంకటపాలంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలు రిజర్వుడు స్థానాల్లోనే పోటీచేయాలనే నిబంధన ఎక్కడా లేదని, ఎక్కడైనా పోటీచేయవచ్చని, తమకు బలమున్న జనరల్ స్థానంలోను పోటీచేయొచ్చన్నారు.
గుంటూరైనా పర్వాలేదు.. విజయవాడైనా పర్వాలేదని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ఘనవిజయం సాధించేందుకు త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తే వాటిని ముఖ్యమంత్రి జగన్ దగ్గర చర్చించి ఆమోదించేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి పరిధిలో త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, తుళ్లూరు-శాఖమూరు రోడ్డును అభివృద్ధి చేస్తామన్నారు.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ డొక్కాకు ముఖ్యమంత్రి జగన్ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, డొక్కా వర్గంగా పార్టీ రెండుగా చీలిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్యే శ్రీదేవితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచే శ్రీదేవి తండ్రితో తనకు పరిచయం ఉందన్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications