జగన్ బ్లడ్ లోనే భయం లేదు.. జగన్ సైనికులకు భయముంటుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని మాజీ మంత్రి, వైసిపి నేత రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు చేసిన మంచి లేదన్నారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయిందని, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరూ ఒకటై ఎదుర్కొంటామని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిన కూటమి నేతలు భయపడాలి: రోజా
ఈవీఎంలతో గెలిచిన కూటమినేతలు ట్యాంపరింగ్ చేసి గెలిచినందుకు వారు భయపడాలని, వైఎస్ జగన్ సైనికులు దేనికి భయపడబోరని ఆర్కే రోజా వెల్లడించారు. అధికారులు చట్ట విరుద్ధంగా పనిచేస్తే హెరాస్మెంట్ కేసులు వేయడం ఖాయమని రోజా తెలిపారు. వైఎస్ఆర్సిపి నాయకులు అందరం నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి రోజా వెల్లడించారు.

సూపర్ సిక్స్ హామీల అమలు లేదు
ఐదేళ్లు అధికారంలో ఉన్న తాము ఎలాంటి తప్పు చేయలేదని రోజా తెలిపారు. గతంలో 14సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది కూడా ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. మోసాలకు పాల్పడి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
జగన్ వెంట నడిచే సైనికులం .. భయపడేది లేదు
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల పైన ప్రభుత్వ వేధింపులను సహించేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేసినా తాము భయపడేది లేదని చెప్పారు. భయం అనేది తమ నాయకుడు జగన్ బ్లడ్ లోనే లేదని, ఆయన వెంట నడిచే సైనికులుగా తాము కూడా ఎవరికి భయపడబోమని రోజా పేర్కొన్నారు.
ఆ అధికారులపై కేసులు పెడతాం
టిడిపి నాయకుల ఒత్తిడికో, తప్పుడు ఆదేశాలకో లోబడి చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారుల పైన కేసులు పెట్టి కోర్టులో నిలబెడతామని రోజా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆరు నెలల కాలంలో వైసిపి నేతలు ఇళ్ళ ముందు గుమ్మాలు కొట్టడం, పొలాలకు అడ్డంగా గోడలు కట్టడం తప్ప టిడిపి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు ఏమీ లేదన్నారు.
కూటమి మోసాలు ప్రజలకు అర్ధమయ్యాయి
వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం తమను ఎలా మోసం చేస్తుందో ప్రజలకు కూడా అర్థమైందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఇకపై కూటమి ప్రభుత్వం పైన తిరుగుబాటేనని రోజా వెల్లడించారు. చంద్రబాబు సర్కార్ పైన ఘాటుగా వ్యాఖ్యలు చేసిన రోజా కేసులు పెట్టినా వెనక్కు వెళ్ళేది లేదన్నారు.












Click it and Unblock the Notifications