క్యాపిటల్ వార్: తెరపైకి ఆర్టికల్ 254.. బీజేపీ ఎంపీది డబుల్ గేమ్ అంటూ మాజీ మంత్రి వడ్డె ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రపరిధిలోనిదేనని, సీఎం జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కేంద్రం ఆమోదం తెలుపుతుందంటూ బీజేపీ చేస్తోన్న వాదన అర్థంలేనిదని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే, ఆర్టికల్ 254ను ఉటంకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 254..
ఏపీకి రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోం శాఖ నోటిఫై చేసిన లేఖపై రాజకీయ దుమారం రేగడంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మీడియాకు వివరణ ఇచ్చారు. రాజధాని కొనసాగింపు లేదా తరలింపు సీఎం జగన్ ఇష్టమని, రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని ఆయన తెలిపారు. అయితే, రాజ్యాంగంపై కనీస అవగాహన లేకపోవడం వల్లే జీవీఎల్ ఇలా మాట్లాడుతున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి ఉందని మాజీ మంత్రి వడ్డె చెప్పారు. ఇటీవలే కేరళ ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో దాన్ని తప్పుపడుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ ఆర్టికల్ 254ను ప్రస్తావించడం తెలిసిందే.

ఇలా అడ్డుకోవచ్చు..
‘‘ఏపీలో ప్రభుత్వ బంగళాలు, ఇతర మౌళిక సదుపాయాల నిర్మాణం కోసం కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందని చాలా స్పష్టంగా ఉంది. అప్పటికే అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేసి ఉండటం, ప్రధాని మోడీ సైతం శంకుస్థాపనకు రావడం వల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి రూ.1500 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ కూడా అమరావతికి మరో 1200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. మొత్తంగా ఐదువేల కోట్లకుపైగా అమరావతిలో ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి రాజధానిని మార్చేస్తామంటే కుదరదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం.. తన ప్రజలకు వ్యతిరేకంగా.. అపరిపక్వమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో.. దాన్ని అడ్డుకునే హక్కు ఆర్టికల్ 254 ప్రకారం కేంద్రానికి ఉంటుంది''అని వడ్డె వివరించారు.

జీవీఎల్‌కు సవాల్
రాజ్యాంగం, పార్లమెంట్ నిబంధనలు, సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం.. సీఎం జగన్ నిర్ణయాన్ని అడ్డుకునే హక్కు కేంద్రానికి ఉంటుందని, అయినాసరే బీజేపీ ఎంపీ జీవీఎల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వడ్డె శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘ఏపీకి చెందిన వ్యక్తే అయినా యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ ఏరోజైనా రాజ్యాంగం చదివాడో లేదో? ఆయన విడయవాడొస్తే నాతో చర్చకు సిద్ధంగా ఉండాలని సవాలు విసురుతున్నా.. ఇవాళ నేను చెప్పిన అంశాలన్నింటినీ ఆయనకు వాట్సాప్ లో పంపి వివరణ అడుగుతాను''అని మాజీ మంత్రి అన్నారు.

బీజేపీలో ఉంటూ డబుల్ గేమ్
అమరావతి విషయంలో సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే.. బీజేపీకే చెందిన ఎంపీ జీవీఎల్ జగన్‌కు వంతపాడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ‘‘అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కన్నా చెబుతున్నారు. ఎంపీ జీవీఎల్ కూడా దానికి సరేనంటూనే.. కేంద్రానికి సంబంధం లేదంటూ రెండోరకం వాదన వినిపిస్తున్నారు. అమరావతి అనేది ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారం కాదు.. మొత్తం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు చెందిన విషయం. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోబోదని జీవీఎల్ చెప్పడం చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి''అని వడ్డె శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications