'వెల్లంపల్లి'కి వెచ్చగా.. 'సామినేని' సెగ?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు విజయావకాశాలున్నాయా? లేదా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలతోపాటు జనసేన ఓట్లు చీల్చడంతో ఏడువేల మెజారిటీతో వెల్లంపల్లి నెగ్గి మంత్రి అయ్యారు.

వెనకబడిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు సీటు ఆశిస్తున్నారు. వారిని ఎంపీ కేశినేని నాని వ్యతిరేకిస్తుండటంతో వెల్లంపల్లిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ వెనకబడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ ను జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకువెళ్లారు. శ్రీనివాస్ కుమార్తె వివాహం కావడంతో జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆకుల శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు. సామినేని ఉదయభాను, ఆకుల శ్రీనివాస్ కాంగ్రెస్ హయాం నుంచి కూడా మంచి సన్నిహితులు.

సామినేనిపై మండిపడ్డ వెల్లంపల్లి
విజయవాడలో బొప్పన భవకుమార్ అనే నాయకుడు తన జన్మదనం సందర్భంగా వైసీపీ నేతలందరినీ ఆహ్వానించారు. ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్ ను కూడా ఆహ్వానించారు. ఆ సమయంలో వెల్లంపల్లి తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి దగ్గరకు ఎందుకు తీసుకువెళ్లావని సామినేనిని ప్రశ్నించారు. అంతేకాకుండా నోరు జారారు. దీంతో సామినేని కూడా వెల్లంపల్లిపై నిప్పులు చెరిగారు. ఇరువురు నేతల మధ్య మాటామాటా పెరిగి పెద్దదైంది. సామినేనిని ఉద్దేశించి కాపు రౌడీలు అన్నారని, క్షమాపణ చెప్పాలంటూ కాపునాడు డిమాండ్ చేసింది.

వెల్లంపల్లిపై కాపుల్లో వ్యతిరేకత
వెల్లంపల్లి జనసేనాని పవన్ కల్యాణ్ ను పదే పదే టార్గెట్ చేయడంవల్ల అతనిపై కాపు సామాజికవర్గంలో బాగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విజయవాడ పశ్చిమలో ఉన్న కాపుల ఓట్లు వెల్లంపల్లికి కష్టమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంత్రి ఉన్న సమయంలోనే వెల్లంపల్లిపై అనేక ఆరోపణలు వచ్చాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి సీటు రావడం కష్టమని, వైఎస్ జగన్ మదిలో వేరేవారున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications