సుజనా ఇల్లు ముట్టడి: ‘హోదా’ కోసం కాంగ్రెస్ రగడ, రోడ్లు ఊడ్చి వినూత్న నిరసన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని రగిల్చింది. ఈ రాజకీయ వేడిని కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం కూడా రాష్ట్రంలో నిరసనలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట వినూత్న నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ రోడ్లు ఊడ్చి తమ నిరసన తెలియజేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో వినూత్న నిరసనకు దిగారు. చేతిలో చీపురు పట్టుకుని నగరంలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ప్రత్యక్షమైన విష్ణు అక్కడి రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. మల్లాదితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాలుపంచుకున్నారు.

Ex Mla Malladi vishnu cleans vijayawada roads for ap special status

కాంగ్రెస్ నేతల నిరసన కార్యక్రమాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మల్లాదితో పాటు మహిళా కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కేంద్ర మంత్రి సుజనా ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలు

కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం వీర్లపాడులోని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనకు దిగింది. యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుజనా ఇంటి ముందు చీపుర్లతో రోడ్లు ఊడ్చి ప్రత్యేక హోదా కోసం సుజనా చౌదరి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవినేని అవినాష్ సీఎం చంద్రబాబు చెప్పినట్టే తాము జపాన్ తరహాలో నిరసనలను వ్యక్తం చేశామని చెప్పారు. ఏపీకి హోదాను సాధించడంలో టీడీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సుజనా ఇంటి ముందు నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వీర్లపాడుకి పెద్ద ఎత్తున తరలిరాగా, స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ex Mla Malladi vishnu cleans vijayawada roads for ap special status.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి