ఆ ఎమ్మెల్యే మాపై కక్ష కట్టారు... అరెస్ట్ చేయించాలని చూస్తున్నారు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కంటతడి
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తమ కుటుంబంపై కక్ష కట్టారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. తిరుపతి కార్పోరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి పోటీ చేసిన తన మనవరాలు కీర్తిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో మంగళవారం(మార్చి 16) నిర్వహించిన మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడారు.
విదేశాల్లో చదువుకుని వచ్చిన కీర్తి... తన తాత లాగే ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. తన పూర్తి సమయం తిరుపతి ప్రజలకే కేటాయించి ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనుకుందన్నారు. కీర్తి ఎన్నికల్లో దిగితే ప్రజలు ఆమెను ఎన్నుకోకుండా దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టుకున్నారు. తన రాజకీయ వారసురాలు కీర్తియేనని ప్రకటించిన సుగుణమ్మ... భవిష్యత్తులో వైసీపీకి ఆమె గట్టి పోటీ ఇస్తుందన్నారు.

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 48 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఒక్క డివిజన్‌కే పరిమితమైంది. 22 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవంగా దక్కాయి. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో 26 డివిజన్లలో వైసీపీ గెలిచింది.ఈనెల తిరుపతి 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్‌గా శిరీష (బీసీ) ఎన్నికయ్యే అవకాశం ఉంది. తిరుపతి నగర పాలక సంస్థలో స్థానిక ఎమ్మెల్యే మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు.
కాగా,ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు,75మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా... 11 కార్పోరేషన్లు,73 మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. కేవలం తాడిపత్రి,మైదుకూరు మున్సిపాలిటీలను మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది. ఫ్యాన్ ప్రభంజనంతో టీడీపీ అడ్రస్ దాదాపుగా గల్లంతైన పరిస్థితి ఏర్పడింది. తాజా విజయంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు.