మందుబాబులకు బిగ్ అలర్ట్ - మద్యం అమ్మకాల్లో కొత్త ట్విస్ట్, రివర్స్ ట్రెండ్..!!
ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీగా ఆదాయం సమకూరింది. మద్యం అమ్మకాల్లో టాప్ లో తిరుపతి ఉండటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. చివరి స్థానంలో అల్లూరి జిల్లా ఉంది. కాగా, అదనపు విక్రయాలతో అధికంగా ఆదాయం వచ్చిందని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు.. కీలక అంశాలను గుర్తించారు. దీంతో పాటుగా నకిలీ మద్యం అమ్మకాలు.. బార్లలో సాగుతున్న అనధికార విక్రయాల పైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్దమైంది.
పెరిగిన ఆదాయం
ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. బీరు అమ్మకాలు ఏకంగా 129శాతం పెరగడం ఇదే తొలి సారి. లిక్కర్ విక్రయాలు దాదాపు 24శాతం పెరిగాయి. వీటి ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి క్వార్టర్‌లో భారీగా అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూ రినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 82.98 లక్షల కేసుల మద్యం అమ్మితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 102.7 లక్షల కేసుల మద్యం అమ్ముడైంది. అంటే 23.77 శాతం పెరిగింది. బీరు గతేడాది మొదటి క్వార్టర్‌లో 28.22 లక్షల కేసులు అమ్మితే, ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో 64.6లక్షల కేసులు అమ్మారు. దీంతో గతేడాది 6,050.87కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది 6,899 కోట్లు వచ్చింది. ఆదాయం 14.02 శాతం పెరిగింది. నెలకు రూ.2300 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

అమ్మకాలు పెరిగినా
అమ్మకాలు పెరిగితే అంతే స్థాయిలో ఆదాయం కూడా పెరగాలి. కానీ అమ్మకాల విలువ 11.33 శాతం, ఆదాయం 14.02శాతం మాత్రమే పెరిగింది. ప్రభుత్వం రూ.99 బ్రాండ్లను తీసుకొచ్చింది. ఆ బ్రాండ్ల అమ్మకాలు మొత్తం మార్కెట్ విలువలో దాదాపు 30శాతంగా ఉన్నాయి. దీంతో అమ్మ కాలు పెరిగినా.. విలువ, ఆదాయంలో అది కనిపించడం లేదు. అమ్మకాల్లో తిరుపతి టాప్‌లో నిలిచింది. మొదటి క్వార్టర్‌లో ఈ జిల్లాలో ఏకంగా రూ.494 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖపట్నంలో రూ.492 కోట్లు, నెల్లూరులో రూ.416కోట్లు, ఎన్టీఆర్‌లో రూ.408 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రూ.71కోట్ల మద్యం అమ్ముడైంది. పార్వతీపురం మన్యంలో రూ.110 కోట్లు మాత్రమే అమ్మారు.
అక్కడ రివర్స్ ట్రెండ
అన్ని జిల్లాల్లో అమ్మకాల విలువ పెరిగితే ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 2.34శాతం అమ్మకాలు తగ్గాయి. ఈ జిల్లాలో నకిలీ మద్యం అమ్మకాలు పెరగడం దీనికి కారణంగా అధికారులు గుర్తించి నట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారుల మధ్య సమన్వయం ఒక ముఖ్య స్థానంలో ఉన్న అధికారి కారణంగా దెబ్బ తిన్నతిన్నట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా రాష్ట్రమంతా ఒక దారిలో వెళ్తుంటే, పశ్చిమ రివర్స్ ట్రెండ్‌లో నడుస్తోందని చెబుతున్నారు. ఇక, బార్ లైసెన్సీలు ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం బార్‌లోనే మద్యం సేవించాలి. కానీ చాలావరకు బార్ల లైసెన్సీలు షాపుల తరహాలో బయటకు మద్యం సీసాలు అమ్మేస్తున్నారు. అధికా రులు పట్టించుకోకపోవటం వలన కొన్ని బార్లలో 24గంటలూ మద్యం దొరుకుతోందనే విమర్శలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications