వివాహేతర సంబంధం: మోసం చేసేందుకు యత్నించిన ఎంపీడీఓ అరెస్ట్
విశాఖపట్నం: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను మోసం చేసిన ఎంపీడీఓను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణ అనే నిందితుడు అరకులో ఎంపీడీవోగా పనిచేసిన సమయంలో ఆఫీసు అటెండర్‌గా ఉన్న కొర్రా లక్ష్మితో సన్నిహితంగా మెలిగాడు. భర్త చనిపోయి, ముగ్గురు పిల్లలున్న లక్ష్మిని లోబర్చుకున్నాడు. అన్ని విధాలుగా చూసుకుంటానని చెప్పి ఉద్యోగం మాన్పించాడు.
పది నెలల క్రితం అక్కడినుంచి వడ్డాది మాడుగులకు బదిలీ కావటంతో ఆమెను వదిలించుకోవాలని చూశాడు. దీంతో తనకు అన్యాయం జరుగుతోందంటూ ఆమె పెద్దలను ఆశ్రయించింది లక్ష్మి. ఇక మరోదారి లేక రూ.3 వేలు నెలనెలా ఖర్చులకు పంపిస్తానంటూ బేరానికి వచ్చాడు.
ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి మారికవలసలోని రాజీవ్ గృహకల్ప ప్లాట్‌లో ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా, ఆగస్టు 26న లక్ష్మి అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పిన సత్యనారాయణ విశాఖలోని మానసిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించే ప్రయత్నం చేశాడు.

ఆమె మానసికంగా ఆరోగ్యంగానే ఉందని తేల్చిన అక్కడి వైద్యాధికారులు సత్యనారాయణను మందలించి వారిని పంపించేశారు. అనంతరం తిరిగి వచ్చే క్రమంలో ఆమెను ఏదోలా వదిలించుకోవాలని సత్యనారాయణ నిర్ణయించుకున్నాడు.
ఒక హోటల్ వద్ద ఆపి, భోజనం చేద్దామంటూ ఆమెను కిందికి దించాడు. ఆమె లోపలికి వెళ్లగా సత్యనారాయణ మాత్రం కారుతో ఉడాయించాడు. ఈ విషయాలపై బాధితురాలు మహిళా సంఘాల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు శుక్రవారం సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications