ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం: చివరకు ప్రాణం తీసింది
కృష్ణా/ఖమ్మం: ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం సీతానగరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గూడెంమాధవరం గ్రామానికి చెందిన వివాహితుడు కంచర్ల వేణు(25) కొద్దికాలం క్రితం అదే జిల్లా వత్సవాయిలో రైస్‌మిల్లు లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు.
కాగా, అక్కడే వీఆర్వోగా పనిచేస్తున్న అనిత అనే వికలాంగురాలైన మహిళతో ఆర్థిక పరమైన సంబంధాలు నెరిపాడు. ఈ క్రమంలో ఏర్పడిన అనుబంధం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఆమెతో ఉంటున్నాడు. అక్కడ ఉంటూనే తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం సీతానగరంలో కూడా ఓ రైస్‌మిల్లు అద్దెకు తీసుకొని నడిపిస్తున్నాడు.

ఇక్కడ కూడా మరో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సీతానగరంలో ఉన్న సదరు మహిళ పనిమీద వేరే గ్రామం వెళ్లింది. వత్సవాయిలో ఉన్న అనిత తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడగటంతో, ఇస్తానని చెప్పి.. ఆదివారం తనను సీతానగరం తీసుకొచ్చాడు.
డబ్బుల విషయమై ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంలో వేణు అనితను తీవ్రంగా కొట్టటంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అనిత చనిపోయిందని భయపడిన వేణు.. తాను కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
కాగా, కొంత సమయం తర్వాత అనిత లేచిచూడగా వేణు ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. చుట్టుపక్కల వాళ్లుకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. వేణు దాడిలో గాయపడిన అనితను వైద్యం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications