వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న వైఎస్ జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మరోసారి భారీగా నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 28వ తేదీన దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. దీని కోసం ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోన్నారు. ఖాతాల జాబితాలను సిద్ధం చేశారు. వైఎస్ జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచే నిధులను విడుదల చేయనున్నారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటను నష్టపోయిన రైతుల కోసం ఈ నిధులను మంజూరు చేయనున్నారాయన. మొత్తంగా 45,998 మంది రైతులకు ఈ పంట నష్టపరిహారం మొత్తం అందబోతోంది. దీనికి సంబంధించిన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వారి ఖాతాల్లోకి సుమారు 40 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని మళ్లించనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో గోదావరి నదికి సంభవించిన వరదల వల్ల రైతులు పెద్ద ఎత్తున పంటను కోల్పోయారు.

అప్పట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ ఏడాదే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకున్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పంటపై అధికారులు శరవేగంగా వివరాలను సేకరించారు. దీనితో పాటు సెప్టెంబర్ - అక్టోబర్‌లల్లో సంభవించిన వర్షాల వల్ల సంభవించిన పంట నష్టంపైనా లెక్కలు తీశారు. మొత్తంగా 60,832 హెక్టార్లల్లో పంట నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు.
ఈ రెండు సీజన్లను కలిపి పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఏ సీజన్‌లో సంభవించిన పంట నష్టం కోసం ఇన్‌పుట్ సబ్సిడీని అదే సీజన్‌లో ముగిసేనటికి విడుదల చేస్తోన్నామని వైఎస్ జగన్ చెప్పారు. రైతులకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను కూడా ఇదివరకే తాము విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications