విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింగపూర్‌లా చేస్తానని చెప్పా: బాబు, రాజధాని అంటే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సింగపూర్ పర్యటన, రాజధాని విషయమై మాట్లాడారు. రాజధాని అంటే డైనమిక్‌గా ఉండాలన్నారు. పోలవరం నుండి కృష్ణాకు నీరు వస్తే రాయలసీమకు తరలించవచ్చునని తెలిపారు.

పోలవరం కాలువ పూర్తి కావడానికి రూ.600 కోట్లు అవసరమని చెప్పారు. తమ సింగపూర్ పర్యటన విజయవంతం అయ్యేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజధానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. రాజధానికి ఒక్కొక్కరు ఒక్కో ఇటుకను ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

2022 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత సాధించుకోవాలన్నారు. 2029 నాటికి ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు. మన జనాభాలో సింగపూర్ జనాభా పదోవంతు ఉంటుందని, కానీ జీడీపీ నాలుగు రెట్లు ఎక్కువ అని చెప్పారు. సింగపూర్ జీడీపీ 300 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు.

Farmers ready to give lands: Chandrababu

రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, కొందరు ఉద్దేశ్యపూర్వకంగా వారిని రెచ్చగొడుతున్నారని చెప్పారు. సింగపూర్ తరహా రాజధానిని చేస్తానని తాను హామీ ఇచ్చానని చెప్పారు. ల్యాండ్ పూలింగులో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

భూములు ఇచ్చేందుకు చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. భూములు ఇచ్చేందుకు ఎవరైనా ఇష్టపడకుంటే తన తెలివితేటలు ఉపయోగించి వారిని కన్విన్స్ చేస్తానని చెప్పారు.

తుంగభద్ర అధునికీకరణకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దఱామయ్య అంగీకరించారని చెప్పారు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని అద్భుతమైన రాజధానిని తాము నిర్మిస్తామని చెప్పారు. ప్రణాళిక, చిత్తశుద్ధితో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సింగపూర్‌తో ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు.

కఠోర పరిశ్రమ, ప్రణాళికబద్ధ పాలన, పాలకుల చిత్తశుద్ది వల్లే సింగపూర్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. సింగపూర్ తలసరి అదాయం మనకంటే ఇరవై నుండి ముప్పై రెట్లు అధికంగా ఉందన్నారు. సింగపూర్‌కు మనకంటే చాలాకాలం తర్వాత స్వాతంత్రం వచ్చిందన్నారు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుందన్నారు.

మన నౌకాశ్రయాలు కాలుష్య కారకాలుగా ఉంటే, సింగపూర్ పోర్టులు లాజిస్టిక్ హబ్‌లుగా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం, వ్యాపారవేత్తల సహకారం తీసుకుంటామని చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం మన శక్తిని రుజువు చేస్తుందన్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, న్యాయస్థానాలు ఇవే కాదన్నారు. సామాజిక జీవన నగరంగా ఉండాలన్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామిని అయ్యాననే భావన ప్రతి తెలుగువాడిలో రావాలన్నారు.

English summary
Farmers ready to give lands, says AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X