కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు స్పాట్ డెడ్..
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా లోడ్‌తో వేగంగా వస్తున్న లారీ.. ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఆ వేగానికి కారుపైకి లారీ ఎక్కడంతో.. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా బెంగళూరు నుంచి బద్వేల్ లోని చింతపుత్తలపల్లె గ్రామానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతొ తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదంలో మృతి చెందిన వారిని శ్రీకాంత్, శిరీష్, హర్షిణి, రిషిగా గుర్తించారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని కడప రిమ్స్‌కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కారుపై పడిన లారీని తొలగించేందుకు సుమారు రెండు గంటలు పట్టినట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల స్వగ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

మరోవైపు ఈ గువ్వల చెరువు ఘాట్ రోడ్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు వాపోతున్నారు. దాదాపు 14 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఘాట్ రోడ్డులో అత్యధిక మలుపులు ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. వేగాన్ని నియంత్రించలేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాద ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఏపీ వ్యాప్తంగా గడిచిన ఆరు నెలల్లోనే 2,000కి పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని 1,500 మందికి పైగా మరణించినట్టు అధికారిక లెక్కల్లో స్పష్టం అవుతోంది. ప్రభుత్వం తరఫున ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, పోలీసుల పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications