అనంతలో దారుణం: మద్యం మత్తులో కన్న కొడుకు గొంతు కోసిన తండ్రి
అమరావతి: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే మద్యం మత్తులో నాలుగేళ్ల కన్న కొడుకు గొంతుకోశాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న రంగనాథ్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి పుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
దీంతో కుటుంబ సభ్యులు అతనితో గొడవకు దిగారు. తెల్లవారు జాము వరకు గొడవ జరుగింది. ఈ క్రమంలో తండ్రి రంగనాథ్ కత్తి తీసుకుని మంచంపై నిద్రపోతున్న తన నాలుగేళ్ల కన్నకొడుకు గొంత కోసి పారిపోయాడు. దీంతో పిల్లాడు అరుపులు కేకలు పెట్టడంతో చిన్నారి తాత, నాయనమ్మ లేచారు.

వెంటనే చిన్నారిని హుటాహుటిన తాడిపత్రి పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం బాలుడు శశాంక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు శశాంక్ తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతిగా మద్యం సేవించి ఉండటం వల్లే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడా? లేదా మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications