ఏపీలో తారాస్ధాయికి బండి శ్రీనివాస్ వర్సెస్ కేఆర్ సూర్యనారాయణ పోరు.. !
ఏపీలో రెండు కీలక ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్ (ఏపీఎన్జీవో), కేఆర్ సూర్యనారాయణ (ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) మధ్య పోరు ఇవాళ తారాస్దాయికి చేరుకుంది. జగన్ సర్కార్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిన్న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన కేఆర్ సూర్యనారాయణపై విమర్శల దాడి మొదలుపెట్టిన బండి శ్రీనివాస్ ఇవాళ కూడా తన మాటల దాడి కొనసాగించారు. అదే సమయంలో సూర్యనారాయణ కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు.

గవర్నర్ కు ఫిర్యాదు రేపిన చిచ్చు
ఏపీలో వైసీపీ సర్కార్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఈ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పిన ఉద్యోగసంఘం నేత కేఆర్ సూర్యనారాయణ.. అందుకు దారి తీసిన పరిస్ధితుల్ని వివరించారు. దీంతో గుర్తింపు సంఘం నేత అయి ఉండి గవర్నర్ కు ప్రభుత్వంపై ఎలా ఫిర్యాదు చేస్తారంటూ నిన్న ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాస్ ఆయనపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో వారి గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామంటూ హెచ్చరికలు కూడా చేశారు. దీంతో అసలు గొడవ మొదలైంది.

అంటకాగడం లేదన్న బండి శ్రీనివాస్
అయితే సూర్యనారాయణ నిన్న గవర్నర్ ను కలవడంలో తప్పులేదని, అయితే తోటి ఉద్యోగ సంఘంపై విమర్శలు చేయడం తప్పని ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాస్ తెలిపారు. తాము ప్రభుత్వంతో అంటకాగుతున్నామన్న విమర్శల్ని కూడా ఆయన తప్పుబట్టారు. తాము ఉద్యోగుల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామన్నారు. కారుణ్య నియామకంతో ఉద్యోగం తెచ్చుకున్న సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయాలని సీఎస్ ను కలిసి కోరతామని బండి శ్రీనివాస్ హెచ్చరించారు. ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు ఇవ్వాలని ఆల్రెడీ చట్టం ఉందని, ప్రభుత్వమే దాన్ని పాటించడం లేదని బండి తెలిపారు.

హెచ్చరికలపై సూర్యనారాయణ ఫైర్
జీతాలు సకాలంలో చెల్లింపు కోసం చట్టం చేయమని అడిగితే గుర్తింపు రద్దు చేయమంటూ హెచ్చరికలు చేస్తారా అంటూ సూర్యనారాయణ ఇవాళ ఏపీ ఎన్జీవో నేతలపై మండిపడ్డారు. అంతే కాదు తమ వెనుక లక్షలాది మంది మనోభావాలు ఉన్నాయన్నారు. ఉద్యోగుల సర్వీసుల్ని నియంత్రించే అధికారం గవర్నర్ కు ఉంది కాబట్టే ఆయన్ను కలిశామని సూర్యనారాయణ నిన్నటి ఫిర్యాదును సమర్ధించుకున్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లించే చట్టం ఇప్పటికే ఉందన్న బండి శ్రీనివాస్ వ్యాఖ్యలపైనా సూర్యనారాయణ అభ్యంతరం తెలిపారు. అదే నిజమైతే క్షమాపణలు కోరతానన్నారు. ఏపీ ఎన్జీవోలు తనపై చేసిన ఫిర్యాదులు పక్కనబెట్టి సీఎం జగన్ గుర్తింపునిచ్చిన విషయాన్ని సూర్యనారాయణ గుర్తుచేశారు.మరోవైపు గవర్నర్ ను కలవకూడదా, ఆయన ఏమన్నా దేశద్రోహా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications