పవన్ అజెండాను సుప్రీం వరకూ తీసుకెళ్తున్న వాసిరెడ్డి పద్మ.. ! ఏం చేశారంటే ?
ఏపీలో ఒకప్పుడు వైసీపీ హయాంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసి ఆ తర్వాత స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుని ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నించి విఫలమైన వాసిరెడ్డి పద్మ ఆ తర్వాత వైసీపీకీ గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆమె కూటమి పార్టీలైన టీడీపీ లేదా జనసేనకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ ఇవాళ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న సోషల్ మీడియా దాడులపై కీలక అడుగు వేశారు.
మహిళలపై పెరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాజాగా కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించి సీరియస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ వాసిరెడ్డి పద్మ జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఇందులో మహిళలపై జరుగుతున్న సోషల్ మీడియా దాడులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలు చేయాలని కోరారు.

సోషల్ మీడియాలో మహిళల పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టులో పిల్ వేయాలని జాతీయ మహిళా కమిషన్ ను వాసిరెడ్డి పద్మ కోరారు. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలపై ,మహిళా హోంమంత్రి, రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని అందులో పేర్కొన్నారు.పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుండి మహిళలను కాపాడలేమన్నారు.
సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సమీక్షించాలని జాతీయ మహిళా కమిషన్ కు రాసిన లేఖలో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే జాతీయ మహిళా కమిషన్ సుప్రీం కోర్టులో పిల్ వేసి కఠినమైన చట్టం అమలుకు పూనుకోవాలని పద్మ కోరారు.












Click it and Unblock the Notifications