గన్నవరంలో వంశీకి ప్రత్యామ్నాయం వెతుక్కున్న జగన్-త్వరలో పార్టీలో చేరిక..!
ఏపీ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉండే నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా గన్నవరం కూడా ఒకటి. గతంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గన్నవరం పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలిచేది. అయితే మొదట్లో టీడీపీలో ఉన్న వంశీ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో గెలిచిన ఆయన వైసీపీలోకి వెళ్లాక చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు దాదాపు సమాధి కట్టాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గం వీడారు. దీంతో ఇప్పుడు ఆయన స్ధానంలో వైసీపీకీ ప్రత్యామ్నాయం దొరికింది.
గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి మారడంతో ఆయన స్ధానంలో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో వంశీ వైసీపీ అండతో రెచ్చిపోయి చేసిన అరాచకాలతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీ పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకున్నారు. దీంతో అమెరికాకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీకి గన్నవరంలో ఇన్ ఛార్జ్ అవసరం అయ్యారు.

కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో వైసీపీకి గన్నవరం వంటి టీడీపీ కుల ప్రభావంగా ఉండే నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ దొరకడం కష్టం. ఇలాంటి పరిస్ధితుల్లో వైఎస్ షర్మిల పీసీసీ ఛీఫ్ అయ్యాక ఆమెతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ రూపంలో వైసీపీకి ఆప్షన్ దొరికింది. గత ఎన్నికల్లో గన్నవరం టికెట్ ఆశించిన షర్మిల ఆమెకు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె ఉపాధ్యక్ష పదవిని రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పద్మశ్రీ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. దీనికి జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆమె వైసీపీలో చేరి గన్నవరం ఇన్ ఛార్జ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications