JD Lakshminarayana :2024లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ అక్కడే-ఏ పార్టీ తరపునో తెలుసా ?
ఒకప్పుడు జగన్ అక్రమాస్తుల కేసుతో తెరపైకి వచ్చిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అప్పట్లో రేపిన సంచలనాలు మామూలువి కాదు. ముఖ్యంగా జగన్ కేసుల్లో ఆయన బయటపెట్టిన రోజువారీ వివరాలు పత్రికల్లో రావడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. దీంతో ఓ దశలో వైసీపీ నేతలు ఆయనపై ఎదురుకేసులు పెట్టేందుకు ప్రయత్నాలు కూడా విఫలయత్నం చేశారు. ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో సీబీఐకి గుడ్ బై చెప్పి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జేడీ లక్ష్మీనారాయణ మరోసారి ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.
దీనిపై లక్ష్మీనారాయణ ఇవాళ కాకినాడలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నదీ, ఏ పార్టీ నుంచి అన్న దానిపై లక్ష్మీనారాయణ సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వైసీపీకి మంటపుట్టించేలా ఉన్నాయి. అదే సమయంలో విపక్షాలు ఆయనకు మద్దతిచ్చి గెలిపించేందుకు పోటీ పడే పరిస్ధితి కూడా కనిపిస్తోంది. అంతిమంగా వైసీపీ వర్సెస్ విపక్షాల పోరులో జేడీ లక్ష్మీనారాయణ కీలకంగా మారబోతున్నట్లు అర్ధమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో తాను తప్పనిసరిగా మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ ఇవాళ కాకినాడలో ప్రకటించారు. ఏ పార్టీ తరఫున పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికే సన్నిహితులతో తాను చర్చలు జరుపుతున్నానని ఆయన వెల్లడించారు. ఏ పార్టీ తరపున పోటీ చేయకపోతే మాత్రం ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఆయన ఏదో ఒక పార్టీని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ నేరుగా అవకాశం కల్పించలేకపోయినా ఆయనకు పరోక్షంగా మద్దతిస్తుంది. గత ఎన్నికల్లో మాత్రం లక్ష్మీనారాయణ ఒంటరిగా పోటీ చేసిన జనసేన తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications