అమరావతికి మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం-జగన్ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ మొదలయ్యాక అమరావతి రాజధాని కోరుతూ కౌంటర్ ఉద్యమం మొదలైంది. ఇఫ్పటికే దాదాపు 700 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు రైతులు వచ్చే నెల 1 నుంచి మహా పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇవాళ అమరావతి వచ్చారు.
అమరావతిలో 681 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతుల్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇవాళ తుళ్లూరులో కలిశారు. ఉద్యమం సాగుతన్న తీరుపై వారిని ఆరా తీశారు. అనంతరం లక్ష్మీనారాయణ వారికి తన సంఘీభావం ప్రకటించారు. తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చిన లక్ష్మినారాయణ కాసేపు వారితో గడిపి సంఘీభావం తెలిపారు. దీంతోపాటు త్వరలో రైతులు చేపట్టదలచిన మహా పాదయాత్రకు కూడా లక్ష్మీ నారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భఁగా సీబీఐ మాజీ జేడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత చంద్రబాబు పాలనను, ప్రస్తుత జగన్ పాలనతో పోల్చారు.

అమరావతిలో 681 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారని, రైతులు భూములు ఇచ్చింది వారి స్వప్రయోజనాల కోసం కాదు...రాష్ట్ర ప్రయోజనాల కోసమని లక్ష్మీనారాయణ అన్నారు. మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే మనసు కలిచివేస్తుందన్నారు. మాతృమూర్తులను పోలీసులు కొట్టడం చూసి భాధ ఆవేదన కలిగిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాజధానిని ఇక్కడే నిర్మించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా రాజధానిపై ఒక విధానంతో ముందుకు వెళ్ళాలని లక్ష్మీనారాయణ కోరారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని, .అమరావతి అనేది రాష్ట్ర సమస్యన్నారు. గత ప్రభుత్వం కొంత ఖర్చు చేసి ఎంతో కొంత నిర్మాణ పనులు చేసిందని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. గత ప్రభుత్వం 10 వెల కోట్లు ఖర్చు చేసి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసిందని, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతుల త్యాగం మరిచిందని లక్ష్మీనారాయణ ఆరోపించారు. రైతులు వారి స్వార్ధం కోసం భూములు ఇవ్వలేదని లక్ష్మీనారాయణ అన్నారు. రైతులపై ప్రభుత్వ పెద్దలు.అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications